‘మారిటల్‌ రేప్‌’ అంశంలో కీలక పరిణామం.. కేంద్రానికి ఇంక ఛాన్స్‌ల్లేవ్‌!

21 Feb, 2022 17:17 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలో మరింత గడువు కోరుతూ.. పిటిషన్‌ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని సోమవారం సున్నితంగా తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు.

పిటిషన్‌లపై స్పందించేందుకు మరింత సమయం కావాలని కోరిన సాలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా‌.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10వ తేదీనే అభిప్రాయసేకరణకు సమాచారం అందించామని, అయితే ఇంకా స్పందన రాలేదని తెలిపారు. అయితే కోర్టు మాత్రం  కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జస్టిస్‌ రాజీవ్ శక్ధేర్, జస్టిస్‌ సి హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రం వైఖరిని ‘‘త్రిశంకు’’ లాంటిదంటూ పేర్కొంది. గడువు కోరే అంశం ఎప్పుడో దాటిపోయిందని గుర్తు చేసింది.

Marital Rapeను నేరంగా పరిగణించాలంటూ పలు పిటిషన్‌లు ఢిల్లీ హైకోర్టులో దాఖలు అయ్యాయి. ఇదిలా ఉండగా..  భారతదేశం పరిస్థితుల నేపథ్యంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించేందుకు సిద్ధంగా లేమని గతంలో కేంద్ర ప్రభుత్వం ఓసారి పేర్కొంది. ఇష్టం లేకున్నా, ఆమె సమ్మతి లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా అనుభవించడాన్ని నేరంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా లేమని పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేసింది. ‘‘అంతర్జాతీయ నిర్వచనం వేరు, భారత సమాజ స్థితిగతులు వేరు. లా కమిషన్‌ కూడా నివేదికలు సమర్పించే సమయంలో ఈ అంశాన్ని సిఫారసు చేయలేదు. ’’ అని కేంద్రం తరపున ఆ సందర్భంలో ప్రకటన వెలువడింది. 

సంబంధిత వార్త: మారిటల్‌ రేప్‌.. డబుల్‌ గేమ్‌

ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కోర్టుల్లో ఈ అంశంపై పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. 2017లో కేంద్రం స్టాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. ఆ తర్వాత కొత్తగా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనను తీసుకోలేదు. మరోవైపు.. ఈ వ్యవహారంపై కేంద్రం ఈ ఏడాదిలో వాదనలు వినిపించకపోవడం గమనార్హం. 

సెక్షన్ 375 భారతీయ శిక్షాస్మృతి (IPC) మినహాయింపు 2 ప్రకారం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించకూడదు. అలాగే 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని తన భార్యతో.. భర్త లైంగిక సంబంధం కలిగి ఉన్నా కూడా అది అత్యాచారం కాదని నిర్దేశిస్తుంది. భారతదేశంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని చాలా మంది న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పౌరుల నుండి భారీ డిమాండ్ ఉంది. ఏది ఏమైనప్పటికీ, నేరీకరణ అనేది సామాజిక-చట్టపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని కేంద్రం వాదిస్తోంది.

మరిన్ని వార్తలు