భార్యభర్తల మధ్య కలహాలు..పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య

10 Mar, 2021 10:23 IST|Sakshi

ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో  నిప్పంటించుకున్న భర్త 

ఆపై భార్యను పట్టుకోవడంతో ఇద్దరూ మృతి

 అనాథగా మిగిలిన కుమారుడు

కరీమాబాద్‌ : ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం.. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చనే అవగాహన కరువై క్షణికావేశంలో దంపతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా నిండు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతుండగా, పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇటీవల వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో లేబర్‌ కాలనీకి చెందిన హరికృష్ణ ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

భార్య తనపై ఫిర్యాదు చేసిందన్న ఆవేదనతో ఆయన ఆత్మహత్యాయత్యానికి పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను మరువకముందే వరంగల్‌ 23వ డివిజన్‌ కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో సోమవారం అర్ధరాత్రి బండి భాస్కర్‌(40) భార్య విజయ(36) సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం కలహాల కారణంగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఆయన భార్య విజయను గట్టిగా పట్టుకుని ఆమెపై కూడా పెట్రోల్‌ పోయడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆర్థిక ఇబ్బందులతో...
ఆటోలో తిరుగుతూ బట్టలు అమ్ముకునే బండి భాస్కర్, బీడీ కార్మికురాలైన విజయ దంపతుల నడుమ రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో గొడవలు జరుగుతున్నాయి. ఇంతలోనే విజయ భర్త దగ్గరి నుంచి తన బంధువుల ఇంటికి వెళ్లడాన్ని సహించలేకపోయిన భాస్కర్‌ ఈ ఘాతునికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాను మాత్రమే చనిపోవద్దని నిర్ణయించుకున్న ఆయన పథకం ప్రకారమే భార్య వద్దకు వెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ఇద్దరూ కన్నుమూశారు.

ఈక్రమంలో అడ్డుకోవడానికి వచ్చిన వారిని భాస్కర్‌ బెదిరించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా వీరి మృతితో పధ్నాలుగేళ్ల కుమారుడు అశ్విత్‌ ఇప్పుడు అనాథలగా మారాడు. ఈ ఘటనపై విజయ తండ్రి వెంకటేష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మిల్స్‌ కాలనీ ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

చదవండి : (తండ్రి ప్రాణం తీసి.. టవల్‌తో ఉరివేసి)
(బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్‌ చేయించి..)

మరిన్ని వార్తలు