హిజ్రా ప్రాణం తీసిన ప్రేమ: స్వప్నతో నిషాంత్‌ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..

23 Nov, 2021 09:00 IST|Sakshi
స్వప్న (ఫైల్‌)   

హిజ్రా బలవన్మరణం 

సాక్షి, మీర్‌పేట్‌: ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తి వదిలివెళ్లాడని మనస్తాపానికి గురై ఓ హిజ్రా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన మొదపూరపు గుణ అలియాస్‌ స్వప్న (హిజ్రా) (24) కొంత కాలంగా మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నందనవనం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలోని ఓ ఫ్లాట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లా నిడమనూరుకి చెందిన బైక్‌ మెకానిక్‌ గోశెట్టి నిషాంత్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇంట్లో పూజ ఉంది రమ్మని వారం క్రితం తండ్రి నుంచి ఫోన్‌ రావడంతో నిషాంత్‌ ఊరికి వెళ్లొస్తానని చెప్పివెళ్లాడు. హిజ్రాను వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులకు తెలిసి కొడుకును తిరిగి హైదరాబాద్‌ రానివ్వలేదు. నిషాంత్‌ విషయాన్ని స్వప్నకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆదివారం ఆమె వాళ్ల ఊరికి వెళ్లి చూడగా ఇంటికి తాళం ఉంది. దీంతో నిడమనూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాంత్, వారి తల్లిదండ్రులను పిలిపించగా స్వప్న తనకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. రాత్రి నందనవనంలోని రూమ్‌కి వచ్చింది. సోమవారం ఉదయం ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

చదవండి: (పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం)

మరిన్ని వార్తలు