Siddipet Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ..

25 May, 2022 14:01 IST|Sakshi
నామా వేణుగోపాల్‌ (24) , పూజ (26)

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ఆమెకు పెళ్లైంది. కానీ, ఇన్నాళ్లలో భర్తతో ప్రేమగా ఏనాడూ మాట్లాడింది లేదు. దగ్గరకు రానిచ్చింది లేదు. కారణం.. ఆమె మనసులో మరో వ్యక్తి ఉన్నాడు. పెళ్లయ్యాక మరో వ్యక్తిని ఇష్టపడింది ఆమె. ఇద్దరూ గప్‌చుప్‌గా చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగారు. విషయం ఇంట్లో తెలిసింది. కోపడ్డారు. కలిసి బతకడం సాధ్యం కాదనుకుంది.. ఆత‍్మహత్యతో ప్రాణం తీసుకున్నారు.

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని మంగళవారం రాత్రి యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమాయ్యాయి. సమాచారం తెలుసుకున్న జగదేవ్‌పూర్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యువకుడి ఆధార్‌కార్డు, ద్విచక్రవాహనం ఆర్‌సీ లభించడంతో వాటి ఆధారంగా వివరాలను సేకరించారు. 

ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పూజ(26), రాజీవ్‌నగర్‌కు చెందిన నామా వేణుగోపాల్‌(24) సిరిసిల్లలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. చాలాకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉ‍న్నారు.  విషయం ఇంట్లో తెలిసి పెద్దలు మందలించారు. ఈ నెల పదిహేనవ తేదీన డ్యూటీకి అని వెళ్లి.. పూజ తిరిగి రాలేదు. దీంతో తన భార్య కనిపించకుండా పోయిందని సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు పూజ భర్త.

పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి పీర్లపల్లి అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న శవాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధార్‌కార్డు ఆధారంగా పూర్తి వివరాలను సేకరించారు. ముఖాలు గుర్తు పట్టలేనంతగా మారిపోవడంతో.. ఉరేసుకుని చాలారోజులై ఉంటుందని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పంచనామా చేసి మృతదేహాలను గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు