తాడిపత్రిలో వివాహిత దారుణ హత్య.. వారిపైనే అనుమానం?

19 May, 2023 08:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తాడిపత్రి అర్బన్‌(అనంతపురం జిల్లా): మంచంపై నిద్రిస్తున్న వివాహితను తలపై కత్తితో నరికి చంపి.. పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నందలపాడులో చోటుచేసుకుంది. ఆ మహిళను భర్త లేదా కుమారుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉం­టారని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు తె­లి­పిన ప్రాథమిక సమాచారం మేరకు.. నందలపాడు­కు చెందిన రంగనాథ్‌రెడ్డి, శివమ్మ (48) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమార్తెలందరికీ వివాహమైంది. కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఇటీవల ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం కావడంతో కొడుకును ఇంటికి రావొద్దని తల్లి శివమ్మ వ్యతిరేకించింది. దీంతో రవీంద్రనాథ్‌రెడ్డి తాడిపత్రిలోనే వేరు కాపురం పెట్టాడు.
చదవండి: అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు

కాగా.. భర్త రంగనాథ్‌రెడ్డి, భార్య శివమ్మ ఇద్దరే నందలపాడులో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి శివమ్మ తన ఇంటి వసారాలో మంచంపై నిద్రపోగా.. భర్త రంగనాథ్‌రెడ్డి ఇంటి మిద్దెపైకి ఎక్కి పడుకున్నాడు. గురువారం ఉదయం కిందకు దిగొచ్చిన రంగనాథ్‌రెడ్డి తన భార్య పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు.

ముమ్మాటికీ హత్యే కానీ..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 70 శాతానికి పైగా కాలిపోయిన శివమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. కాలిపోతున్నప్పుడు కేకలు వేసేదని పోలీసులు చెబుతున్నారు. మంటల్లో కాలిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో అటూఇటూ తిరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని గుర్తించిన పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి శివమ్మ హత్యకు గురైందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చి క్లూస్‌ టీమ్‌ను రప్పించారు.

శివమ్మ తలపై కత్తిలాంటి పదునైన ఆయుధంతో నరికిన ఆనవాళ్లను క్లూస్‌ టీమ్‌ కనుగొంది. శివమ్మ తలపై రెండుచోట్ల బలమైన లోతు గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముందుగా శివమ్మను తలపైకొట్టి హత్య చేసి.. ఆ తర్వాత పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.

చంపిందెవరో!
కాగా, శివమ్మను చంపింది ఎవరనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. తన భార్య హత్యకు గురైనా.. ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త రంగనాథరెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు ఇటీవలే మతాంతర వివాహం చేసుకున్న కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిని శివమ్మ ఇంట్లోకి రానివ్వకపోవడంతో అతడేమైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే అనుమానం కూడా ఉంది. కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. శివమ్మ అంత్యక్రియలు ముగిసిన అనంతరం తండ్రీ కొడుకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం గానీ.. వారిద్దరిలో ఎవరు హంతకులో చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు