AP Crime News: అడ్డగోలు ఈఎంఐలు.. భర్తపై కోపంతో బలవన్మరణం

4 Aug, 2022 17:49 IST|Sakshi

కృష్ణా (మచిలీపట్నం): ఇంట్లో వాయిదాల పద్ధతిపై కొనుగోలు చేసిన వస్తువుల కారణంగా ఏర్పడిన వివాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అనవసరమైన ఖర్చులు పెడుతూ పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నాడంటూ భర్తపై కోపం తెచ్చుకున్న భార్య ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ నాగకళ్యాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మచిలీపట్నం అరుణోదయకాలనీకి చెందిన రాగోలు సత్యవతి (25) అదే కాలనీకి చెందిన అశోక్‌బాబును ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం నారాయణపురంలో నివాసం ఉంటున్నారు. సజావుగా సాగిపోతున్న వీరి కాపురంలో ఈఎంఐలు కలతలు రేపాయి. భర్త ఇంట్లోకి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్‌ మిషన్‌ తదితర వస్తువులను వాయిదాల పద్ధతిలో ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రతి నెల వాయిదాలు చెల్లించటం కష్టంగా మారటంతో సత్యవతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా అప్పులు చేసి వస్తువులు కొనుగోలు చేయటం మనకు అవసరమా అంటూ మందలించటం మొదలుపెట్టింది. 

ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండగా బుధవారం తీవ్ర మనస్తాపానికి చెందిన సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తండ్రి రాజేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.   

మరిన్ని వార్తలు