సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, ఐదంకెల జీతం అని నమ్మించి..

15 Dec, 2020 10:20 IST|Sakshi
రమ్యశ్రీ( ఫైల్‌ ఫొటో)

సాక్షి, కాకినాడ క్రైం: కాకినాడ పల్లంరాజు నగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాకినాడ మూడో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన మండాల రమ్యశ్రీ(23)కి కాకినాడకు చెందిన వెంకట్‌తో 2018 ఆగస్టు 19న వివాహమైంది. ఆ సమయంలో వెంకట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని, ఐదంకెల జీతం అని చెప్పి నమ్మబలికి అతడి కుటుంబం లక్షలాది రూపాయలు డిమాండ్‌ చేశారు. బిడ్డ భవిష్యత్తు బాగుండాలని భావించిన రమ్యశ్రీ తల్లిదండ్రులు అప్పు చేసి మరీ రూ.30 లక్షల కట్నం, నగదు సమర్పించారు. వివాహమైన కొన్నాళ్లకే రమ్యశ్రీపై అదనపు కట్నపు వేధింపులు ప్రారంభమయ్యాయి. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..)

పల్లంరాజునగర్‌ పవన్‌ గార్డెన్స్‌ అపార్ట్‌మెంట్‌లో రమ్యశ్రీ భర్త, అత్తమామలతో కలిసి ఉండేది. అత్తింటివారి వేధింపులు తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమయ్యేది. రమ్యశ్రీ 2019 నవంబర్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతకుముందే ఆచారం ప్రకారం పుట్టింటివారు తీసుకువెళ్లారు. ఇదే అదునుగా భావించిన వెంకట్‌ కుటుంబ సభ్యులు రమ్యశ్రీని 11 నెలల వరకు ఇంటికి తీసుకురాలేదు. అదనపు కట్నంతోనే అడుగుపెట్టాలంటూ వేధించేవారు. ఈ నేపథ్యంలో కొందరు పెద్దలు మధ్య వర్తిత్వంతో తాత్కాలికంగా సద్దుమణిగింది.  చదవండి: (నిన్న చెల్లెలు.. నేడు అన్న మృతి) 

ఈ ఏడాది అక్టోబర్‌లో రమ్యశ్రీ తన బిడ్డతో సహా అత్తింటిలో అడుగుపెట్టింది. ఆమె రాకను జీర్ణించుకోలేని అత్తమామ సౌభాగ్యలక్ష్మి, మురళీకృష్ణ గుంటూరులో ఉన్న చిన్నకుమారుడు వద్దకు వెళ్లిపోయారు. నవంబర్‌లో చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకకు వారు హాజరై తిరిగి వెళ్లిపోయారు. వారు దూరంగా ఉన్నా రమ్యశ్రీకి వేధింపులు ఆగలేదు. వారు ఫోన్‌లో వేధించడంతోపాటు భర్త ప్రత్యక్షంగా ఇంట్లో ఉంటూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రమ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని భర్త, ఆ ఇంటి పైపోర్షన్‌లో ఉంటున్న చిన్నత్తయ్య, చినమామయ్య సంధ్యారాణి, విక్రమ్‌శ్రీనివాస్‌ మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చనిపోయిందని చెప్పారు. వారే త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆగమేఘాల మీద చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమ కుమార్తెను కొట్టిచంపారని కటుంబ సభ్యులు ఆరోపించారు. ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై నిజానిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్య చేసింది భర్త, అత్త, మామలేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మూడవ పట్టణ పోలీసులు తెలిపారు.  చదవండి: (అన్నలారా.. మేమెలా బతకాలి?)  

మరిన్ని వార్తలు