చావు కోరిన ప్రేమ

1 Aug, 2020 12:17 IST|Sakshi
మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న పోలీసులు ,మృతురాలు నర్సింగమ్మ(ఫైల్‌)

పదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం 

సంతానం కలగట్లేదంటూ రెండో పెళ్లికి సిద్ధమైన భర్త 

మనస్తాపం చెంది భార్య ఆత్మహత్య ! 

భర్తే చంపాడంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ 

దౌల్తాబాద్‌ యాంకి గ్రామంలో విషాదం 

దౌల్తాబాద్‌: లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో వీడలేనంత దగ్గరయ్యాయి. పెద్దలు వద్దని వారించినా వినకుండా పెళ్లి చేసుకున్నారు. కాపురం సవ్యంగా సాగుతున్న సమయంలో చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి. అయితే భార్య శుక్రవారం తెల్లవారజామున ఇంట్లో అనుమానస్పదంగా మృతిచెంది ఉంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.... మండలంలో యాంకి గ్రామానికి చెందిన నర్సింగమ్మ(25)ను అదే గ్రామానికి చెందిన మాణిక్యప్ప పదేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో ఆ వివాహాన్ని వద్దని పెద్దలు వారించారు. అయినా వారి మాట వినకండా పెళ్లి చేసుకున్న వారు ఒక్కటయ్యారు. అనంతరం వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. గ్రామంలో ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్‌లో కూలీపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాలుగునెలల కింద గ్రామానికి వచ్చారు.

 మృతురాలు నర్సింగమ్మ దళిత మహిళ కావడంతో పాటు సంతానం లేకపోవడంతో భర్త మాణిక్యప్ప తరచూ వేధిస్తుండేవాడు. మరో వివాహం చేసుకుంటానని భర్త వేధించడంతో నర్సింగమ్మ మనస్తాపం చెందేది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎప్పటిలాగే ఇద్దరూ భోజనం చేసి నిద్రించారు. తెల్లారేసరికి నర్సింగమ్మ ఇంట్లో ఓ గదిలో విగతజీవిగా పడి ఉంది. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు వచ్చి శవాన్ని పరిశీలించగా నోట్లో నుంచి నురుగు రావడం, మెడపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో భర్తే హత్య చేశాడంటూ సుమారు గంటసేపు శవాన్ని ఇంట్లో ఉంచి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.  విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ విశ్వజాన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా మృతురాలి కుటుంబసభ్యులు వినకపోవడంతో సీఐ నాగేశ్వర్‌రావు కేసును పూర్తిస్థాయిలో విచారించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిగి డీఎస్పీ పరిశీలించారు. మృతురాలి అన్న మాలశీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా