మా అక్కను హత్యచేశారు

14 Sep, 2020 10:59 IST|Sakshi

సాక్షి, జలుమూరు: వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన జలుమూరు మండలం కొండపోలవలస గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కొర్ను హైమావతి (27) ఇంటిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొటబొమ్మాళి మండలం వాండ్రాడకు చెందిన చిన్నాల కృష్ణమూర్తి, చిన్నమ్మడు కుమార్తె హైమావతిని కొండపోలవలసకు చెందిన కొర్ను జానకీరావుకు ఇచ్చి 2015లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ. ఏడు లక్షల కట్నం, ఏడు తులాల బంగారంతోపాటు సారె కూడా ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే కొద్ది రోజులకే హైమావతిని అత్తింటివారు వేధించేవారని మృతురాలి సోదరుడు చిన్నాల హరిప్రసాద్‌ ఆరోపించారు. భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగినా పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేవారన్నారు. ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయని, అవి కాస్తా పెద్దవి కావడంతో హైమావతి ఆత్మహత్య చేసుకోవడానికి దారితీశాయని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.  

‘మా అక్కను హత్యచేశారు’ 
మా అక్క ఆత్మహత్య చేసుకునేఅంత పిరికిది కాదని హైమావతి సోదరుడు హరిప్రసాద్‌ ఆరోపించారు. బావ జానకీరావు, అత్త, మామ, ఆడపడుచు కొట్టి చంపేసి..ఆత్మహత్యగా చిత్రీకరించి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైమావతి భర్త జానకీరావు, అత్త నారాయణమ్మ, మామ అప్పన్న, ఆడపడుచు లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సైతోపాటు నరసన్నపేట, ఆమదాలవలస సీఐలు తిరుపతిరావు, ప్రసాదరావులు సందర్శించి వివరాలు సేకరించారు. 

పాపం పసివాళ్లు  
తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కావడంతో వారి చిన్నపిల్లలు మనోజ్, జాహ్నవిలు అనాథలుగా మిగిలారు. వీరిద్దరూ తల్లి మృతదేహం చుట్టూ తిరుగుతూ..ఏం జరిగిందో తెలియక బిక్క ముఖంతో చూస్తు ఉండడం స్థానికులను కలిచివేసింది. కాగా హైమావతి మృతి విషయం తెలుసుకొని వలస కూలీలుగా హైదరాబాద్‌లో ఉంటున్న తల్లిదండ్రులు బయలుదేరి వస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు