పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నా... హసీనాతో ప్రేమ పాఠాలు

5 Nov, 2022 11:12 IST|Sakshi

చిన్నతనంలోనే వివాహం.. ఐదేళ్లు గడిచేలోపే ఇద్దరు పిల్లలు.. అంతలోనే భర్త వేధింపులు.. ఇదే సమయంలో మరో వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం. అతని మాయమాటలు నమ్మి తప్పటడుగులు.. తల్లిదండ్రులు మందలించడంతో బలవన్మరణం. వందేళ్ల జీవితాన్ని 25 ఏళ్లకే ముగింపు పలికిన దొర్నిపాడు మండల కేంద్రానికి చెందిన హసీనా గాథ ఇది. 

సాక్షి, నంద్యాల(దొర్నిపాడు): మండల కేంద్రం దొర్నిపాడుకు చెందిన దూదేకుల బాషా.. తన కూతురు హసీనా(25) తొమ్మిదో తరగతి చదువుతుండగానే వైఎస్సార్‌ జిల్లా పెద్ద ముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన బాబయ్యకు ఇచ్చి గతంలో వివాహం చేశాడు. అయితే కొంతకాలానికే భర్త వేధింపులు మొదలయ్యాయి. మానసిక పరిస్థితి సరిగాలేక చీటికిమాటికీ కొడుతుండటం, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో మొదట్లో హసీనా సర్దుకుపోయింది. అంతలోనే ఇద్దరు కుమారులు బషీద్, బాలదస్తగిరి జన్మించారు. అయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో ఐదేళ్ల క్రితం పిల్లలను తీసుకుని పుట్టినింటికి వచ్చేసింది. పొలం పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది.  

55 ఏళ్ల వక్తితో ఫేస్‌బుక్‌ పరిచయం..  
ఐదు నెలల క్రితం బాపట్ల జిల్లా నర్సాయపాలెం గ్రామానికి చెందిన 55 ఏళ్ల వయసున్న భూషణం ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. అతనికి పెళ్లీడుకొచ్చిన కుమారుడు, కూతురు ఉన్నా... హసీనాకు తియ్యని ప్రేమపాఠాలు చెప్పాడు. కష్టాల్లో ఉన్న ఆమెకు.. అతని మాటలు సాంత్వన చేకూర్చేలా ఉండటంతో దగ్గర కావడానికి ఎంతో సమయం పట్టలేదు. అక్టోబర్‌ 31న అతనితో కలిసి చిన్న కుమారుడిని తీసుకొని బాపట్లకు వెళ్లిపోయి అక్కడ కాపురం పెట్టారు. కాగా తన కూతురు, మనవడు కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన బాషా పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు వారి ఆచూకీ గుర్తించి గురువారం సాయంత్రం దొర్నిపాడు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ భూషణం మాటమార్చినట్లు సమాచారం. తనకు ఎలాంటి సంబంధం లేదని, అందరిలాగే హసీనాతోనూ చాటింగ్‌ చేశానని చెప్పడం, తల్లిదండ్రులు మందలించడంతో ఆమె అవమానంగా భావించి శుక్రవారం తెల్లవారు జామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ తిరుపాల్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన కూతురి ఆత్మహత్యకు కారకుడైన భూషణంను కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తండ్రి వదిలేయడం, తల్లి బలవన్మరణం చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.  

మరిన్ని వార్తలు