ఆమనగల్లులో మహిళపై అత్యాచారం.. హత్య

16 Sep, 2021 16:06 IST|Sakshi
సంఘటనా స్థలం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

వివాహేతర సంబంధమే కారణమా!

ఘటనా స్థలాన్ని సందర్శించిన డీసీపీ

సాక్షి, ఆమనగల్లు: ఓ మహిళపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం ఆమనగల్లు మున్సిపల్‌ పరిధిలోని నుచ్చుగుట్ట తండా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపల్‌ పరిధిలోని ముర్తుజపల్లికి చెందిన కొమ్ము గాలయ్య, పోచమ్మ (39) దంపతులు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లగా.. కరోనా నేపథ్యంలో పోచమ్మ తల్లిగారి ఊరైన మాడ్గుల మండలం చంద్రాయణపల్లికి వచ్చి నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లో పారిశుధ్య కారి్మకురాలిగా పనిచేస్తున్న పోచమ్మ.. ప్రతిరోజు చంద్రాయణపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంది.

ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త ఫోన్‌ చేయగా ఆమనగల్లులో ఆటో ఎక్కి వస్తున్నానని చెప్పింది. రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుచ్చుగుట్టతండా సమీపంలో రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమి చ్చారు. ఆమనగల్లు సీఐ ఉపేందర్, ఎస్‌ఐ ధర్మేశ్‌ çఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు మహిళ గొంతు కోసి, కాలు నరికారు. మృతురాలిని పోచమ్మగా గుర్తించారు. సమీపంలో మృతురాలి దుస్తులు, మద్యం సీసాలు న్నాయి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. 
చదవండి: Hyderabad: బాలికపై సవతి తండ్రి అత్యాచారం 

ఐదు ప్రత్యేక బృందాలు 
హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలాన్ని షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌తో కలసి పరిశీలించారు. ఆమనగల్లు పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించామని, వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.  

పోలీసులు అదుపులో నిందితుడు? 
పోచమ్మను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలు, ఫోన్‌కాల్‌ లిస్టు ఆధారంగా ఆమనగల్లులో ఓ చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. 

మృతదేహంతో ఆందోళన 
పోస్టుమార్టం పూర్తయిన అనంతరం పోచమ్మ మృతదేహాన్ని పోలీసులు ముర్తుజపల్లికి తరలించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆందోళనకు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని తీసుకుని ఆమనగల్లులో ధర్నా చేయడానికి తరలుతుండగా జంగారెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు