దాంపత్య జీవితంలో వివాదం.. భర్తకు దూరంగా ఉంటూ చివరకు..

29 Mar, 2022 12:21 IST|Sakshi
సుజాత

తిరుమలాయపాలెం (ఖమ్మం) : దంపతుల గొడవతో భర్తకు దూరంగా పిల్లలను చదివించుకుంటూ ఖమ్మంలో ఉంటున్న మహిళ తనకు న్యాయం చేయాలంటూ చేసిన పోరాటం ఫలించలేదు. ఇటీవల ఆమె వాటర్‌ ట్యాంకు ఎక్కి దూకేందుకు యత్నించగా, న్యాయం చేస్తామనే అధికారుల హామీతో దిగొచ్చింది. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం పురుగుల మందు తాగిన ఆమె, తన మరణం తర్వాతైన పిల్లలకు న్యాయం చేయాలని లేఖ రాయడం గమనార్హం. వివరాలిలా ఉన్నా యి. 

తిరుమలాయపాలెంకు చెందిన ఆళ్ల నాగ య్య కుమారుడు రవితో కూసుమంచికి చెందిన ఆళ్ల సుజాతకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు జన్మించాక దాంపత్య జీవితంలో వివాదా లు రావడంతో కొన్నేళ్లుగా సుజాత ఖమ్మంలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. పిల్లలు పెరుగుతున్నందున భర్త ఆస్తిలో వాటా ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చెయ్యాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఈనెల 14న ఆమె తన పిల్లలు ఉజ్వల, వెంకటమహేశ్‌తో కలిసి తిరుమలాయపాలెం మండల పరిషత్‌ కార్యాలయంలోని వాటర్‌ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఆరోజు ఎస్సై గిరిధర్‌రెడ్డి, తహసీల్దార్‌ పుల్ల య్య, ఎంపీడీఓ జయరాం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి కిందకు దింపారు. ఆ తర్వాత మళ్లీ ఎవరూ పట్టించుకోకపోవడంతో సోమవారం ఉదయం పురుగుల మందు తాగిన సుజాత... ‘నా చావుకి అత్తామామలు నాగయ్య–పిచ్చమ్మ, భర్త రవికుమార్, గ్రామ సర్పంచ్‌ కొండబాల వెంకటేశ్వర్లు కారణం. వారిపై చర్యలు తీసుకోవాలి’అని కోరుతూ ఎస్సైని ఉద్దేశించి లేఖ రాసింది. తన మరణం తర్వాతైన పిల్లలకు న్యాయం చేయాలని ఆ లేఖలో కోరింది. కాగా, ప్రస్తుతం ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు