కృష్ణప్రియ ఆత్మహత్య: కీలక విషయాలు వెలుగులోకి

23 Oct, 2020 08:14 IST|Sakshi

సాక్షి, జగద్గిరిగుట్ట: అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఐదునెలల గర్భిణి కృష్ణప్రియకేసులో వాట్సప్‌ చాట్‌ వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... 'ఆత్మహత్యకు ముందు  కృష్ణప్రియ తన స్నేహితురాలితో సంభాషించింది. ఈ సందర్భంగా తన భర్త శ్రావణ్ బంగారం కోసం కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిండు గర్భిణి అని చూడకుండా తిట్టడం, కొట్టడం చేస్తున్నాడని కృష్ణప్రియ బాధపడింది. నా జీవితం ఇలా అయిపోయిందని నిరాశ చెందింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇక ఎవరికి చెప్పుకోవాలి తప్పదు కదా అంటూ స్నేహితురాలితో ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్నందున తల్లికి చెప్పుకున్నా ఫలితం లేదు' అంటూ వారివురి మధ్య సంభాషణ సాగింది. అనంతరం బుధవారం రాత్రి కృష్ణప్రియ అత్తింట్లో ఆత్మహత్య చేసుకుంది. కాగా.. భర్త శ్రావణ్‌ ఐడీపీఎల్‌లో జిమ్‌ నిర్వహణకు కృష్ణప్రియ 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది.  

అత్తింటి వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దిల్సుఖ్‌నగర్‌కు చెందిన సంజీవరావు కుమార్తె కృష్ణప్రియ (24)కు సందీప్‌ అనే వ్యక్తితో వివాహం కాగా విడాకులు తీసుకున్నారు. తర్వాత కృష్ణప్రియ మొదటి నుంచి తాను ప్రేమిస్తున్న పాపిరెడ్డినగర్‌కు చెందిన వరుసకు మేనబావ శ్రవణ్‌కుమార్‌ను రెండో వివాహం చేసుకుంది. (కరోనాతో భర్త.. బంగ్లాపై నుంచి దూకి భార్య!)

అయితే, పెళ్లయిన నాటినుంచి అత్త మీనా, భర్త శ్రవణ్‌ అదనపు కట్నం, బంగారం తేవాలంటూ వేధిస్తున్నారు. ఐదు నెలల గర్భిణి అయిన కృష్ణప్రియకు సీమంతం కోసం తమ ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చినా అత్తమామలు పంపలేదు. తాము అడిగిన బంగారం, బైక్‌ ఇస్తేనే పంపిస్తామన్నారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన కృష్ణప్రియ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లి లీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా