గుణదల మహిళది హత్యే?.. వివాహేతర సంబంధంతో.. పదేపదే..

1 Jan, 2023 11:38 IST|Sakshi

సాక్షి, పెనమలూరు: కానూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళది హత్యేనని తేలింది.ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని చెబుతున్నారు. కానూరులో గురువారం రాత్రి గుణదలకు చెందిన ముమ్మిడివరపు గౌరమ్మ (50) కానూరు శివారు పంచాయతీరాజ్‌ ఎంప్లాయిస్‌ కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

ఆమె గుణదల నుంచి వచ్చి ఇక్కడ ఎలా చనిపోయిందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి ఫోన్‌కాల్‌ డేటాను పరిశీలించగా ఆమె యనమలకుదురుకు చెందిన జయరావు అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా జయరావు ఆచూకీని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. గుణదలకు చెందిన మృతురాలు గౌరమ్మ, ప్రసాదంపాడు బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యనమలకుదురు నివాసి జయరావుకు గత కొద్ది కాలంగా పరిచయం ఉంది. జయరావుకు వివాహం అయింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు.

అయితే గౌరమ్మ తరచుగా జయరావుకు ఫోన్‌ చేసి ఇబ్బంది పెట్టసాగింది. దీంతో గురువారం మద్యం తాగిన జయరావు బైక్‌పై గౌరమ్మను కానూరు శివారుకు తీసుకు వచ్చాడు. అక్కడ వీరి మధ్య వివాదం ఏర్పడటంతో ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోస్టుమార్టంలో ఊపిరాడక పోవటంతోనే గౌరమ్మ చనిపోయిందని తేలడంతో కేసు విచారణ వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పై విషయాలు నిందితుడు వెల్లడించాడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు