బ్యాంకులో రుణం ఇప్పిస్తానని.. నెల రోజులు గదిలో బంధించి

11 Jan, 2023 12:00 IST|Sakshi

సాక్షి, తిరుపతి, చెన్నై: బ్యాంకులో రుణం ఇప్పిస్తానని చెప్పి తనను నిర్బంధించి నెల రోజులు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరంది. ఆమె దళిత సంఘం నేతలతో కలిసి చంద్రగిరిలో విలేకరులతో మాట్లాడింది. తాను కుమార్తెతో కలిసి తిరుపతి రూరల్‌ మండలంలో ఉంటూ ఒక పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపింది. వెదురుకుప్పం మండలం బలిజిపల్లె దళితవాడకు చెందిన నాగరాజు తరచూ మాట్లాడేవాడని పేర్కొంది.

తనకు బ్యాంకులో రుణం ఇప్పించాలని కోరడంతో నవంబర్‌ 17న బైక్‌లో గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి గదిలో నిర్బంధించాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. పాకాల మండలం దామలచెరువులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడా అత్యాచారానికి పాల్పడినట్లు వాపోయింది. తనను వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తన స్వగ్రామమైన వెదురుకుప్పం మండలం బలిజిపల్లె దళితవాడలో విడిచి వెళ్లాడని తెలిపింది.

అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు యత్రించడంతో గ్రామస్తులు అండగా నిలిచారని వెల్లడించింది. వారి సాయంతో ఈ నెల 6న తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఎస్పీ దిశ పోలీసులకు కేసును బదిలీ చేశారని వెల్లడించింది. డీఎస్పీ రామరాజు కేసు దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  

మరిన్ని వార్తలు