ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు..

16 May, 2022 11:44 IST|Sakshi
మౌనిక (ఫైల్‌), ఉమామహేశ్వరి (ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన వివాహిత పోగుల మౌనిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై కె.కిశోర్‌ కథనం ప్రకారం.. మౌనికకు 10 సంవత్సరాల క్రితం విద్యాసాగర్‌తో వివాహం జరిగింది. పర్వతగిరిలో కంగన్‌హాల్‌ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భార్యభర్తలు తరచు మనస్తాపానికి గురయ్యేవారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

వరకట్న వేధింపులకు వివాహిత బలి..
సంగెం: వరకట్న వేధింపులు తాళలేక విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది.  చేసుకుంది. వరంగల్‌ జిల్లా సంగెం మండలం లోహితలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లేపల్లి ఉమామహేశ్వరి(20)ని హైదరాబాద్‌ బొల్లారానికి చెందిన కొప్పుల కమలాకర్‌ అలియాస్‌ కిరణ్‌కు ఇచ్చి గత ఏడాది ఆగష్టు 18న వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.2 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంచనాలు కట్నంగా ఇచ్చారు.

కొద్ది రోజులకే భర్త కమలాకర్, అత్త పద్మ, మామ పాండు రూ.6 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగారు. రెండు నెలల క్రితం కొట్టి తల్లిగారింటికి పంపించారు. అప్పటి నుంచి లోహితలోనే ఉంటున్న ఉమామహేశ్వరి.. అదనపు కట్నం ఇవ్వలేక, కాపురానికి వెళ్లలేక మనస్తాపం చెంది ఈ నెల 11న విష గుళికలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తల్లి బొల్లేపల్లి సుమలత ఫిర్యాదు మేరకు కమలాకర్, పద్మ, పాండులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిద్దోజు కిరణ్మయి తెలిపారు.

చదవండి: (ప్రియుడితో సహజీనవం, బుల్లితెర నటి ఆత్మహత్య)

మరిన్ని వార్తలు