Massive blast: పాక్‌లో ఉగ్ర బీభత్సం, చైనా ఇంజినీర్లు దుర్మరణం

14 Jul, 2021 13:07 IST|Sakshi

పాక్‌లో కలకలం  రేపిన ఐఈడీ బ్లాస్ట్‌ 

ఎనిమిది మంది దుర్మరణం​​​​​​

వీరిలో నలుగురు చైనా ఇంజనీర్లు 

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఉగ్ర‌వాదులు మ‌రోసారి విరుచుకుపడ్డారు. చైనా ఇంజనీర్లు, పాకిస్తాన్ సైనికులతో వెళుతున్న బస్సు లక్ష్యంగా పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర పాకిస్తాన్‌లో   బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. 

దాసు  ఆనకట్ట  నిర్మాణ ప‌నుల‌ నిమిత్తం  దాదాపు 30 మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు బస్సులో  వెళ్తుండ‌గా  ఉగ్రవాదులు  రెచ్చిపోయారు.  వీరు జరిపిన ఐఈడీ పేలుళ్ల ధాటికి బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు చైనా ఇంజినీర్లు, ఇద్ద‌రు పారామిల‌ట‌రీ సిబ్బంది, మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒక చైనా ఇంజినీర్, మ‌రో సైనికుడు కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డగా, వీరిలో కొంతమంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు.  మెరుగైన వైద్యం అందించే నిమిత్తం తీవ్రంగా గాయపడిని వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా  గాయపడిన వారిని తరలిస్తున్నారు. 

 

మరోవైపు సహాయ, రక్షణ చర్యలను ముమ్మరం చేశామని మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. అయితే, పాక్‌  సైనికులు, చైనా ఇంజినీర్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సులోనే టెర్రరిస్టులు బాంబులు అమ‌ర్చారా? లేక రోడ్డు ప‌క్క‌న అమ‌ర్చి పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారా? అనే దానిపై స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు