సీఆర్‌ఆర్‌ ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం

30 Jan, 2021 05:15 IST|Sakshi

విద్యాసంస్థకు రూ.1.62 కోట్లు శఠగోపం

ఇంటర్నల్‌ ఆడిటర్, ప్రిన్సిపాల్‌ అరెస్ట్‌  

ఏలూరు టౌన్‌: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సర్‌ సీఆర్‌ రెడ్డి ఫార్మసీ కళాశాలలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. విద్యార్థులు చెల్లించిన ఫీజులను కళాశాల ప్రిన్సిపాల్‌ ఈడ్పుగంటి సుధీర్‌బాబు, ఇంటర్నల్‌ ఆడిటర్‌ శివరామప్రసాద్‌ పక్కదారి పట్టించారు. ఏకంగా రూ.1.62 కోట్లను స్వాహా చేసినట్టు తెలుస్తోంది. సీఆర్‌ఆర్‌ విద్యాసంస్థల యాజమాన్యం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. 

కైంకర్యం చేసిందిలా..: సీఆర్‌ఆర్‌ ఫార్మసీ కళాశాలలో విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేశారు. ఫీజులో రాయితీ కల్పిస్తున్నట్టు ఓ నకిలీ జీవో సృష్టించి.. విద్యార్థులు చెల్లించిన ఫీజుల్లో నుంచి 40 శాతం సొమ్మును స్వాహా చేశారు. ఇలా సుమారు రూ.1.62 కోట్ల మేర సొమ్ములు కాజేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ప్రిన్సిపాల్, ఆడిటర్‌తోపాటు రాణి సంయుక్త, విజయకుమార్‌ అనే ఉద్యోగులకూ ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు