గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంలు తెరిచి.. రూ.65 లక్షలు ఊడ్చేశాడు

31 Aug, 2021 04:05 IST|Sakshi
గ్యాస్‌ కట్టర్‌తో తెరిచిన ఏటీఎం మెషిన్‌లు

స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం సెంటర్‌లో భారీ చోరీ

కర్నూలు జిల్లా డోన్‌లో ఘటన 

డోన్‌ టౌన్‌: కర్నూలు జిల్లా డోన్‌ పట్టణ నడిబొడ్డున గల ఏటీఎం సెంటర్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న రెండు ఏటీఎం మెషిన్లను గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో తెరిచి రూ.65,44,900ను అపహరించుకుపోయాడు. స్థానిక శారద కాన్వెంట్‌ సమీపంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం కేంద్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న రెండు మెషిన్లలో శుక్రవారం బ్యాంక్‌ అధికారులు రూ.80 లక్షల నగదు ఉంచారు. ఆదివారం రాత్రి వరకు రూ.14,55,100 నగదును వినియోగదారులు విత్‌ డ్రా చేసుకోగా.. మిగిలిన రూ.65,44,900ను దుండగుడు అపహరించాడు. 

మంకీ క్యాప్‌ ధరించి.. ఆపై టోపీ పెట్టాడు
ఆదివారం రాత్రి 2.50 గంటల సమయంలో మంకీ క్యాప్, దానిపై మరో టోపీ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కేంద్రం ముందు బయట వైపున ఉన్న సీసీ కెమెరా ధ్వంసం చేసి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తన వెంట తెచ్చుకున్న చిన్న గ్యాస్‌ కట్టర్, ఐరన్‌ రాడ్డు, వాటర్‌ బాటిల్‌ సాయంతో రెండు ఏటీఎంలను లాఘవంగా తెరిచాడు. గ్యాస్‌ కట్టర్‌ వినియోగించే సమయంలో నోట్లు కాలిపోకుండా నీళ్లు పోస్తూ పని ముగించినట్టు లోపల ఉన్న మరో సీసీ కెమెరాలో రికార్డయింది. సోమవారం ఉదయం ఏటీఎం కేంద్రం బయట సీసీ కెమెరా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం వెలుగు చూసింది.

ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం పడటంతో ఆ దారిలో ఎవరూ వెళ్లకపోవడం కూడా ఆగంతకుడికి అనుకూలించింది. సీఐ మల్లికార్జున, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా క్రైం విభాగపు డీఎస్పీ శ్రీనివాస్‌ ఏటీఎం కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్‌ స్క్వాడ్, ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్‌ అకౌంట్స్‌ డిప్యూటీ మేనేజర్‌ బి.ప్రాన్సిస్‌ రుబిరో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడా లేక ఏటీఎం మెషిన్ల తయారీ, మెకానిజంలో నైపుణ్యం గల వ్యక్తా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దొంగను గుర్తించేందుకు పట్టణంలో అన్నివైపులా గల సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు