మ్యాట్రి‘మనీ’ మహిళా చీటర్‌ అరెస్ట్‌ 

27 Feb, 2021 08:05 IST|Sakshi
కొర్రెమ్‌ స్వాతి

సాక్షి, సిటీబ్యూరో: తెలుగు మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతుల ఫొటోలు నిక్షిప్తం చేసి విదేశీ వరులను నమ్మించి బంగారు ఆభరణాలు, చీరలు కొనాలంటూ లక్షల్లో డబ్బులు దండుకొని మోసం చేస్తున్న యువతిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.5,16,920 నగదుతో పాటు ఒక ల్యాప్‌టాప్, నాలుగు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ కథనం ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఇనమడుగుకు చెందిన కొర్రెమ్‌ స్వాతి అలియాస్‌ అర్చన, అలియాస్‌ జూటూరి వరప్రసాద్‌ అర్చన, అలియాస్‌ జూటూరి ఇందిరా ప్రియదర్శిని, అలియాస్‌ పుస్తయి ఎస్‌వీ యూనివర్సిటీలో ఎంబీఏ చదివింది. ఆ తర్వాత నెల్లూరులో ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో ఏర్పడిన పరిచయంతో రంగనాయకులపేటకు చెందిన కొరమ్‌ దుర్గా ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. వేతనాలు సరిపోకపోవడంతో ఆర్థిక సమస్యల కారణంగా మోసాలకు తెరలేపింది.  

గూగుల్‌ ఫొటోలు సేకరించి.. 
గూగుల్‌ వెబ్‌సైట్ల నుంచి సేకరించిన ఫొటోలతో పాటు విదేశీ వరుడు మాత్రమే కావాలంటూ తెలుగు మ్యాట్రిమోనీ సైట్లలో వివరాలు పొందుపరిచింది. రెండో లైన్‌ మొబైల్‌ అప్లికేషన్‌ల ద్వారా వచ్చిన వర్చువల్‌ నంబర్‌(విదేశీ)ను సంప్రదించాలంటూ పేర్కొంది. దీనికి స్పందించిన వరుడు, అతడి తల్లిదండ్రులతో ఆడ, మగ అన్ని స్వరాలతో సెల్‌ లో నిక్షిప్తం చేసిన అడ్కామ్‌ వాయిస్‌ మాడులేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మాట్లాడేది. వారు నమ్మారని అనుకున్నాక స్వాతి వారి పెళ్లి ప్రతిపాదనలకు ఓకే చెప్పేది. ఆ తర్వాత వారితో కొన్నిరోజులు చాటింగ్‌ చేశాకా అమెరికా నుంచి మరికొన్ని రోజుల్లో వస్తానంటూ చెప్పడంతో రాగానే కలుస్తామంటూ వరుడు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపేవారు.  

బంగారు ఆభరణాలు.. చీరలు కావాలంటూ.. 
భారత్‌కు వస్తున్నానని చెప్పిన ఆమె పెళ్లి కోసం బంగారు ఆభరణాలు, చీరలు కావాలంటూ తియ్యటి మాటలతో వరుడు, అతడి తల్లిదండ్రులతో చెప్పేది. పెళ్లయ్యాక మీ ఇంటికే కదా వచ్చేది.. ఒకవేళ డబ్బులు ఎక్కువైతే తిరిగి మీకే ఇచ్చేస్తామంటూ లక్షల్లో డబ్బులు బురిడీ కొట్టించేది. ఆ తర్వాత నుంచి వారికి స్పందించడం మానేసేది. ఇలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఐదుకుపైగా కేసుల్లో ఆమె అరెస్టయ్యింది. తాజాగా రాచకొండలో మరో వరుడికి దాదాపు రూ.1.10 లక్షలు మోసం చేసింది. కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.వెంకటేష్‌ సాంకేతిక సాక్ష్యాలతో నిందితురాలు స్వాతిగా 
గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు.  
చదవండి:
భర్తపై కోపంతో పిల్లలకు వాతలు
అమానుషం.. ఫ్రెండ్‌ తల్లిపైనే అఘాయిత్యం

మరిన్ని వార్తలు