అక్రమ మద్యం రవాణా: ఎంబీఏ విద్యార్థి అరెస్టు

17 Jan, 2021 15:25 IST|Sakshi
అతుల్‌ సింగ్‌(ఫొటో సేకరణ: టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా)

పాట్నా: మద్యంపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ బిహార్‌లో మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కంట పడకుండా గుట్టుచప్పుడుగా మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అయితే ఏకంగా రోజుకు 9 లక్షల విలువ చేసే మద్యాన్ని విక్రయిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పాట్నాకు చెందిన అతుల్‌ సింగ్‌ ప్రైవేటు యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. పౌల్ట్రీ పరిశ్రమలో నష్టపోయిన అతుల్‌ సులువుగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డ దారులు తొక్కి, అక్రమంగా మద్యం అమ్మడం మొదలు పెట్టాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులతో లగ్జరీ కారు, ఐఫోన్లు కొంటూ విలాసవంతంగా జీవించేందుకు అలవాటు పడ్డాడు. పనిలో పనిగా రూ.8 లక్షలు విలువ చేసే స్పోర్ట్స్‌ బైక్‌ను కూడా కొనుగోలు చేశాడు. (చదవండి: కాల్‌మనీ: కీలక నిందితుడి లీలలెన్నో..)

కానీ మందు వాసన పసిగట్టిన పోలీసులు అద్దె ఇంట్లో నివసిస్తున్న అతుల్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. రూ.21 లక్షల విలువైన 1100 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. ఓ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం.. పాట్నాలోని పలు ప్రాంతాల్లో కలిపి అతుల్‌ రోజూ రూ. 9 లక్షలు విలువ చేసే మద్యం విక్రయిస్తున్నాడు. ఈ అక్రమ రవాణాకోసం 30-40 మందిని డెలివరీ ఏంజెట్లుగా నియమించుకున్నాడు. డెలివరీ చేసే ఒక్కో ఆర్డర్‌కు రూ.500 చొప్పున డబ్బులు చెల్లిస్తున్నాడు. కాగా వారణాసి నుంచి నలుగురు స్మగ్లర్లు ఇతడికి అక్రమంగా మద్యం పంపిణీ చేసేవారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఈ స్మగ్లింగ్‌ వ్యవహారంలో అతుల్‌కు సహకరించిన విశాల్‌ కుమార్‌, సంజీవ్‌ కుమార్‌, ఇంద్రజీత్‌ కుమార్‌లను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. (చదవండి: ఈ దొంగకు ఛారిటీ వర్క్‌ ‘కిక్‌’ ఇస్తుంది!)

మరిన్ని వార్తలు