చదివింది ఎంబీఏ.. చేసేది పార్ట్‌టైమ్‌ చోరీలు

4 Nov, 2020 09:12 IST|Sakshi

సాక్షి, జగ్గంపేట: తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన, జల్సాలకు అలవాటు పడి, చదువుకున్న చదువును కాదని నేర ప్రవృత్తిని ఎంచుకున్న యువకుడు చోరీలకు పాల్పడతూ పోలీసులకు చిక్కాడు. ఇతడి వద్ద నుంచి పోలీసులు రూ.రెండు లక్షల విలువైన 52 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు జగ్గంపేట పోలీసుస్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు.

జగ్గంపేటకు చెందిన మేడిశెట్టి మణికంఠ అనే యువకుడు పాత నేరస్తుడు. ఇతను ఎంబీఏ వరకు విశాఖపట్టణంలో చదివి పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తూ నేరాలు కూడా పార్ట్‌టైమ్‌గా ప్రారంభించాడు. 2016లో విశాఖలోని మువ్వలపాలెం పోలీసుస్టేషన్‌లో మొదటి కేసు నమోదైంది. 2018లో మరో మూడు కేసుల్లో మణికంఠ ముద్దాయిగా ఉన్నాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌ పారిపోయాడు. గత జూలైలో జగ్గంపేటలో జరిగిన పలు నేరాలు, చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగ్గంపేటలో ఈనెల రెండో తేదీ సోమవారం పాత నేరస్తుడు మణికంఠ కానిస్టేబుళ్ల కంటపడడంతో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ బృందం పట్టుకున్నారు. జగ్గంపేటలో జరిగిన రెండు నేరాలతో పాటు మరికొన్ని నేరాలకు సంబంధించిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. పాతనేరస్తుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో చొరవ చూపిన జగ్గంపేట హోంగార్డు కొండబాబుకు రూ.రెండు వేల రివార్డు అందించారు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు