ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

26 Nov, 2020 08:26 IST|Sakshi

వివాహిత ఆత్మహత్య?

మృతురాలు ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థిని

వేధింపులతో అత్తింటివారే హత్య చేశారంటూ బాధిత కుటుంబీకుల ఫిర్యాదు

కాళ్ల పారాణి ఆరకముందే అత్తింటి ఆరళ్లను మౌనంగా భరించాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా మార్పు రాలేదు. చివరకు బిడ్డ పుట్టినా కఠిన హృదయాల్లో కనికరం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వివాహిత బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే హత్య చేశారంటూ బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

హిందూపురం : మడకశిరకు చెందిన అర్షియా (26) కోటి ఆశలతో వైద్య విద్య కళాశాలలో విద్యార్థిగా చేరింది. మరో రెండేళ్లలో కోర్సుపూర్తి అవుతుందనుకుంటున్న తరుణంలో హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నూరుల్లా పెళ్లి సంబంధం వచ్చింది. మంచి సంబంధమని నమ్మిన అర్షియా తల్లిదండ్రులు 2019 నవంబర్‌లో నూరుల్లాకు అర్షియానిచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ.5 లక్షలు, అర కిలో బంగారు నగలు అందజేశారు.

30 రోజులు గడవకుండానే...  
వివాహనంతరం భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ అత్తారింటిలో అడుగుపెట్టిన అర్షియా అంచనాలు తలకిందులయ్యాయి. ప్రతి విషయంలోనూ భర్తతో పాటు అత్తింటి వారు ఆమెను అనుమానిస్తూ వచ్చారు. నెలదాటకుండానే ఆమె గర్భం దాల్చింది. దీంతో నూరుల్లాలో అనుమానాలు బలపడుతూ వచ్చాయి. ఆమెపై వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. అదనపు కట్నం కావాలని, కారు, స్థిరాస్తులు రాయించుకురమ్మంటూ భార్యతో గొడవపడుతూ వచ్చేవాడు.

పుట్టినరోజే... 
మంగళవారం అర్షియాకు తల్లిదండ్రులు ఫోన్‌ చేసి, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అప్పటికే ఏం జరిగిందో ఏమో.. ఆమె ఫోన్‌లో సక్రమంగా మాట్లాడలేదు. తర్వాత ఫోన్‌ చేస్తానంటూ పెట్టేసింది. బుధవారం ఉదయాన్ని హిందూపురంలోని నింకంపల్లిలో ఉండే బంధువులు ఫోన్‌ చేసి అర్షియా లేవడం లేదంటూ ఫోన్‌ చేయడంతో ఆమె తల్లిదండ్రులు, సోదరులు హుటాహుటిన హిందూపురానికి చేరుకున్నారు. మంచంపై నిర్జీవంగా పడిఉన్న అర్షియాను చూసి చలించిపోయారు. ఏం జరిగిందని నూరుల్లాను నిలదీశారు. ఇంటి పైకప్పుకు ఆమె ఉరి వేసుకుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇరు కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, ఇంటికి తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వంశీధర్‌గౌడ్, తహసీల్దార్‌ శ్రీనివాసులు, సీఐ బాలమద్దిలేటి.. ఇంటిని పరిశీలించి, విచారణ చేశారు.

మాకు న్యాయం చేయండి 
‘మా కుమార్తెను అనుమానంతో వేధించారు. అదనపు కట్నం కోసమే చంపేశారు.. మాకు న్యాయం చేయండి.. మరో ఆడకూతురు బలి కాకుండా కాపాడండి’ అంటూ డీఎస్పీ, తహసీల్దార్‌ ఎదుట అర్షియా తల్లి అక్తర్‌జాన్, అన్న ఇమ్రాన్‌ కన్నీంటి పర్యంతమయ్యారు. పెళ్లియిన నెలకే అతను అసలు రూపం చూపించాడని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, న్యాయం చేకూరుస్తామంటూ బాధితులకు పోలీసులు భరోసానిచ్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా