పెట్రోల్‌ దాడి ఘటనలోని బాధితురాలు మృతి

9 Mar, 2021 10:01 IST|Sakshi

సాక్షి, మెదక్‌ : అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్ వద్ద వితంతువు మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలోని బాధితురాలు మృతిచెందింది. 80 శాతం కాలిన గాయాలతో హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 3 గంటలకు చక్రి బాయ్ ప్రాణాలు విడిచారు. దీంతో గడిపెద్దాపూ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా పశువుల వ్యాపారి సాజిద్‌ను బాకీ డబ్బులు ఇవ్వాలని మహిళ అడిగినందుకే ఈ ఘాతుకం జరిగిందని అల్లాదుర్గం పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా టేక్మాల్‌ మండలం మల్కాపూర్‌ (అంతాయపల్లి) తండాకు చెందిన 42 ఏళ్ల మహిళ భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలసి తల్లి గారింటి వద్ద ఉంటూ కూలి పనులు చేసి జీవనం సాగిస్తోంది. ఈ వితంతు మహిళకు, పశువుల వ్యాపారం చేసే సాదత్‌తో డబ్బుకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి తనకు చెల్లించాల్సిన డబ్బు గురించి చర్చించేందుకు ఆమె సాదత్‌ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. సాదత్‌ పెట్రోల్‌ లాంటి మండే పదార్థాన్ని ఆమెపై పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను గమనించిన గ్రామస్తులు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను జోగిపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

చదవండి: మహిళను చంపి, ముక్కలుగా నరికి.. ఆపై

మరిన్ని వార్తలు