పేకాట పాపారాయుళ్లు: ప్రతిసారి వాళ్లే ఎలా గెలుస్తున్నారని..

19 Mar, 2021 09:13 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ పద్మజ

పోలీసులమంటూ డబ్బు దోచుకున్న నిందితుల అరెస్ట్‌  

సాక్షి, మేడ్చల్‌ రూరల్‌: పోలీసులంటూ పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన ముఠాను మేడ్చల్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బాలానగర్‌ డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ కు చెందిన అఖిల్‌ అహ్మద్‌ (32) మేడ్చల్‌ పట్టణంలోని చంద్రానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతని మిత్రులు ఇస్లాంపూర్‌కు చెందిన షేక్‌ అహ్మద్‌(21), షేక్‌ అజీమ్‌(25) ముగ్గురు తరచూ పేకాట ఆడేవారు. భాదితులు మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పలుమార్లు వారితో కలిసి పేకాట ఆడారు. ఎప్పుడు పేకాట ఆడినా మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లు డబ్బు గెలుచుకునేవారు.

అఖిల్‌ అహ్మద్, షేక్‌ అహ్మద్, షేక్‌ అజీమ్‌లు సుమారు రూ.7 నుంచి 8 లక్షల వరకు పోగొట్టుకున్నారు. తరుచూ డబ్బు వాళ్లే ఎలా గెలుస్తున్నారు.. ఏదో చేస్తున్నారు అంటూ వీరి నుంచి డబ్బులు ఎలాగైనా రాబట్టాలని ప్లాన్‌ చేసుకున్న ముగ్గురు మిత్రులు వారి స్నేహితులైన ఇస్లాంపూర్‌ కు చెందిన షేక్‌ అక్బర్‌(32), నిజామాబాద్‌కు చెందిన గణేశ్‌(28), షేక్‌ కైసర్‌(30) లతో కలిసి నకిలీ పోలీసులమంటూ బెదిరించి డబ్బులు దోచుకోవాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 14న మేడ్చల్‌లోని ఆర్‌ఆర్‌ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా అఖిల్‌ అహ్మద్‌ మధ్యాహ్నం మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లకు ఫోన్‌ చేసి పేకాట ఆడేందుకు లాడ్జికి పిలువగా వారు సాయంత్రం  వచ్చి అఖిల్‌ అహ్మద్,షేక్‌ అహ్మద్, షేక్‌ అజీమ్‌లతో కలిసి ఆరుగురు లాడ్జీలోని ఓ రూమ్‌లో పేకాట ఆడుతున్నారు.

కొంతసేపటికి డోర్‌ చప్పుడు కావడంతో అఖిల్‌ అహ్మద్‌ పోలీసులు వచ్చారంటూ అరుస్తూ అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని బాత్‌రూమ్‌లో దాక్కున్నాడు. షేక్‌ అహ్మద్‌ వెళ్లి తలుపులు తీసాడు. గణేశ్, షేక్‌ కైసర్‌లు పోలీసులమంటూ గదిలోకి చొరబడి గణేశ్‌ డమ్మీ గన్‌తో బెదిరించి డబ్బు తీసుకొని వెళ్లిపోయారు. ఆ సమయంలో షేక్‌ అక్బర్‌ ఇతరులు ఎవరూ అటు వైపు రాకుండా చూస్తూ లాడ్జ్‌ వారితో మాటలు కలుపుతూ పని ముగిసాక వెళ్లిపోయాడు. తరువాత అఖిల్‌ అహ్మద్,షేక్‌ అహ్మద్‌లు తమకు భయం అవుతుందంటూ బాదితులకు చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి రూ.2.22లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు, బైక్, డమ్మీ గన్, ఫైబర్‌ లాఠీ లను స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు