రోగుల ప్రాణాలతో చెలగాటం..!

16 Jun, 2021 08:29 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: రిమ్స్‌లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వస్తున్న వారికి కాలం చెల్లిన ఇంజక్షన్‌ ఇస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. పట్టించుకోవాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రిమ్స్‌ ఆస్పత్రిలోని మూడో అంతస్తు మేల్‌ జనరల్‌ వార్డులో దాదాపు 30 మంది రోగులు వివిధ రోగాలతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆ వార్డులోని నర్సు ఐదుగురు రోగులకు ఇంజక్షన్లు ఇచ్చింది. వ్యాక్సిన్‌ బాటిళ్లను రోగుల బెడ్లపై ఉంచడంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి కుమారుడు గమనించి ఇంజక్షన్‌కు కాలం చెల్లిందని వైద్యసిబ్బందికి చెప్పడంతో వెంటనే చెత్తబుట్టలో పారేశారు. 

బంధువుల ఆందోళన..
రోగుల బంధువులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీ జేపీ నాయకులు అక్కడికి చేరుకుని వైద్య సిబ్బందిని నిలదీశారు. రిమ్స్‌ డైరెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు ఇచ్చిన యాంటి బయోటిక్‌ ఇంజక్షన్‌ 2019లో తయారుకాగా 2021 జనవరితో గడువు ముగిసింది. ఈ విషయమై ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, బీజేపీ నాయకులు పాయల్‌ శరత్‌ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రిమ్స్‌ సిబ్బంది, డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం రాథోడ్‌ను వివరణ కోరగా కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

సిబ్బందిపై కేసు నమోదు
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాంధీచౌక్‌కు చెందిన గౌరీశంకర్‌శర్మ కుమారుడు కైలాస్‌శర్మ ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ వివరించారు.

చదవండి:  ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ కాలేదు : చైనా వైరాలజిస్ట్‌ 

మరిన్ని వార్తలు