ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?

5 Jun, 2023 09:22 IST|Sakshi
మానస ఫైల్ ఫోటో..

ఖమ్మం అర్బన్‌: ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో బీడీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సముద్రాల మానస (22) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల సమీపంలోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్న ఆమె నాలుగో అంతస్తులోని గదిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్‌ను పోసుకొని నిప్పంటించుకుంది. మంటల్లో ఉన్న మానసను పక్క గదుల్లోని విద్యార్థినులు గుర్తించి హాస్టల్‌ నిర్వాహకులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి 80 శాతం కాలిన గాయాలతో మానస ప్రాణాలు కోల్పోయి కన్పించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మార్చురీకి తరలించారు.  

పెట్రోల్‌ కొనుక్కుని.. 
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రానికి చెందిన మానస కుటుంబం వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో నివాసం ఉంటోంది. కాగా ఇరవై రోజుల క్రితం వరకు కళాశాల సమీపంలోని వసతి గృహంలో ఉన్న ఆమె ఇటీవలే కళాశాల గేటు పక్కనే ఉన్న వసతి గృహంలోకి మారింది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సమీపంలోని ఓ పెట్రోల్‌ బంక్‌కు వెళ్లిన ఆమె సీసాలో పెట్రోల్‌ పోయించుకుని వచ్చింది. ఆ కాసేపటికే గదిలోంచి మంటలు వస్తుండగా పక్క గదుల్లోని విద్యార్థులు గమనించారు. 

మానసిక ఒత్తిళ్లు.. కుటుంబ పరిస్థితులే కారణమా? 
మానస బలవన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీడీఎస్‌ నాలుగో సంవత్సరంలో ఉన్న ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్‌లాగ్‌లున్నట్లు సమాచారం. అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చునని ఆమె స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌ గది తలుపులకు లోపల గడి పెట్టుకొని ఆమె నిప్పంటించుకోగా.. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో మిగతా గదుల్లోని విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే ఖమ్మం సమీప ప్రాంత విద్యార్థినులను వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు తీసుకెళ్లారు. 

పోలీసుల వైఖరిపై విమర్శలు 
మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ చేపట్టాల్సిన పోలీసులు అదేమీ పట్టించుకోకుండా ఆగమేఘాలపై మృతదేహాన్ని మార్చురీకి తరలించి చేతులు దులిపేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్‌ నిర్వాహకులు, సహచర విద్యార్థుల నుంచి వివరాలేమీ సేకరించకుండా హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమయ్యింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బడా ఖానా(సాంస్కృతిక కార్యక్రమాలు) కార్యక్రమంలో పాల్గొనేందుకే వారు హడావుడిగా వెళ్లిపోయినట్లు తెలిసింది. వారు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మానస మృతికి దారితీసిన కారణాలపై కనీస స్పష్టత కొరవడింది.

మరోవైపు ఘటన జరిగిన ప్రాంతానికి మీడియాను అనుమతించొద్దని పోలీసులు చెప్పారంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విలేకరులను హాస్టల్‌ నిర్వాహకులు గేటు బయటే ఆపేశారు. వారు కూడా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ఖమ్మం అర్బన్‌ సీఐ శ్రీహరిని వివరణ కోరగా.. తమ ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్‌ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు.  
చదవండి: నవదంపతులుగా గదిలోకి.. ఎంత సేపటికీ రాలేదు.. తీరా లోపలకి వెళ్లి చూస్తే

మరిన్ని వార్తలు