క్రూరమృగంలా.. నా జీవితం నాశనం చేశాడు

13 Dec, 2022 09:10 IST|Sakshi

 రంగారెడ్డి : తనను కిడ్నాప్‌ చేసి క్రూరమృగంలా వ్యవహరించిన నవీన్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వైద్య విద్యార్థిని వైశాలి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను కోరింది. సోమవారం తన తండ్రి, మేనమామతో కలిసి సీపీకి ఫిర్యాదు చేసింది. తనకు నవీన్‌రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భవిష్యత్‌ను నాశనం చేశాడని విలపించింది. 

నవీన్‌రెడ్డితో తనకు వివాహం కాకపోయినా అయినట్టుగా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్ట్రాగాంలో పెట్టాడని, తమ ఇంటి వద్ద పోస్టర్లు వేసి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశాడని వాపోయింది. ఈ నెల9న తమ ఇంటిపైకి రౌడీలను తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాడని, తన తల్లిదండ్రులను కర్రలతో కొట్టాడని చెప్పింది. ఓ మహిళ అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు పట్టుకొని తనను కార్లో పడేశారని, కనీసం ఊపిరి ఆడకుండా చేశారని సీపీకి వివరించింది.

కారులో గోర్లతో రక్కారని, చేతులు, కాళ్లు విరిచి, మెడపై గాయపరిచి ఘోరంగా ట్రీట్‌ చేశారని వాపోయింది. తనను వదిలిపెట్టమని ప్రాధేయపడగా, అమ్మనాన్నలను చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. నాలుగు రోజులైనా పోలీసులు అతడిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించింది. ఈ కేసు విషయమై ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని త్వరలో పట్టుకుంటామని, ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కమిషనర్‌ హామీ ఇచి్చనట్లు తెలిసింది.   

నవీన్‌రెడ్డి కారు లభ్యం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆచూకీ ఇంకా దొరకలేదు. వైశాలిని కిడ్నాప్‌ చేసేందుకు వాడిన కారును మాత్రం పోలీసులు సోమవారం సాయంత్రం గుర్తించారు. శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి వద్ద ఆ కారును (టీఎస్‌ 07 హెచ్‌ఎక్స్‌ 2111) వదిలేశారు.

పార్కింగ్‌ చేసి, లాక్‌ వేసుకొని నింది తులు పరారయ్యారు. కానీ కారు లైట్లు వెలుగు తూనే ఉన్నాయి. ఈ వాహనాన్ని ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడైంది.     ఇందులో 2019లో వరంగల్‌ ఇంతియార్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద ఒక కేసు, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో 2019లోనే యాక్సిడెంట్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. తాజాగా పీడీయాక్ట్‌ నమోదు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు