Hyderabad: ఫేస్‌బుక్‌ పరిచయం.. కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి..

19 Sep, 2021 09:08 IST|Sakshi
నిందితుడు సందీప్‌కుమార్‌

సాక్షి, చందానగర్‌(హైదరాబాద్‌): ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం.. ఆపై కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేయడం.. ఇలా రెచ్చిపోతున్న ఓ కేటుగాడిని చందానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ జిల్లా మహబుబాబాద్‌కు చెందిన సందీప్‌కుమార్‌ వేమిశెట్టి అలియాస్‌ అభినవ్‌కుమార్‌ (34) ఇంటర్మీడియట్‌ చదివాడు.

2014లో హైదరాబాద్‌కు వచ్చి క్యాటరింగ్‌ పనిచేశాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని సన్నిహితంగా ఉండేవాడు.  కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసేవాడు.

ఇదే క్రమంలో చందానగర్‌ ఠాణా పరిధిలో నివాసం ఉండే ఓ అమ్మాయితో ఫేస్‌బుక్‌లో సందీప్‌కుమార్‌ పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఓ కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ కోటలో బీఫార్మసీ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.46 వేలు వసూలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి పెళ్లి ప్రస్థావన తీసుకురాగా.. అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను అందరికీ షేర్‌ చేస్తానని బెదిరించాడు.

బీఫార్మసీ సీటు కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో బాధితురాలు చందానగర్‌ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో సందీప్‌కుమార్‌ ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడిపై ఇప్పటికే సైబరాబాద్, ఎల్బీనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుల్లో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్‌!

మరిన్ని వార్తలు