అన్నదమ్ముల ఉసురు తీసిన పాలవ్యాన్‌

16 Mar, 2021 10:01 IST|Sakshi

సాక్షి, చిన్నంబావి: ఓ వ్యాన్‌  డ్రైవర్‌ అతివేగం.. నిద్రమత్తు.. రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఉదయం తోట నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరు బాటసారులను పాలవ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి శివారు లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. అమ్మాయిపల్లికి చెందిన గంగిరెడ్డికి ఏడుగురు కుమారులు ఉండగా.. అందులో పెద్దకుమారుడు సాయిరెడ్డి(52), మూడవ కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(47)తో కలిసి గ్రామానికి సమీపన ఉన్న తమ మామిడి తోటను చూసేందుకు ఉదయం 7గంటల ప్రాంతంలో వెళ్లారు.

తిరిగి 8గంటల ప్రాంతలో రోడ్డు నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా చిన్నంబావి నుంచి నుంచి మహబూబునగర్‌కు వెళ్లే పాల వ్యాను డ్రైవర్‌ అతివేగంతో వెళ్తూ.. నిద్రమత్తులో ఉండడంతో వాహనాన్ని అదుపుచేయలేక రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వీరిరువురిని ఢీకొట్టాడు. దీంతో అన్నదమ్ములిద్దరికీ తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.
 

సాయిరెడ్డి కురుమూర్తి దేవస్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈయనకు భార్య సుధారాణి, ఇద్ధరు కుమా రులు ఉన్నారు. రాజశేఖర్‌ రెడ్డి వృత్తిరిత్యా ప్రవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య నవరాగిణి, కుమారుడు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

కురుమూర్తి ఆలయ సిబ్బంది దిగ్బ్రాంతి
చిన్నంతకుంట: కురుమూర్తిస్వామి ఆలయ అకౌంటెంట్‌ సాయిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 2004లో ఆయన అకౌంటెంట్‌గా విధులు చేపట్టాడని, 17ఏళ్లపాటు సేవలం దించాడని, ఆలయ బ్రహ్మోత్సవాలు, స్వామివారిసేవల్లో సాయిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని వారు గుర్తు చేసుకున్నారు.

చదవండి: మిడ్‌మానేరులో ఇద్దరు గల్లంతు.. ఆచూకీ లేదు

మరిన్ని వార్తలు