కరక్కాయ’ రిజర్వ్‌ ధర తగ్గింది! ∙

27 Apr, 2022 09:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరక్కాయ పొడి విక్రయం పేరిట సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించి, కుచ్చుటోపీ పెట్టిన సాఫ్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ టూల్స్‌ (ఓపీసీ)కు చెందిన మినీ బస్సు వేలానికి సైబరాబాద్‌ కాంపిటెంట్‌ అథారిటీ (సీసీఏ) మరోసారి సిద్ధమైంది. ఈసారి 40 సీట్ల సామర్థ్యం ఉన్న అశోక్‌ లేల్యాండ్‌ బస్సు (ఏపీ16 టీసీ 4691) రిజర్వ్‌ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తొలిసారి బస్సు వేలం నిర్వహించినప్పుడు రిజర్వ్‌ ధర రూ.5 లక్షలుగా, రెండోసారి ఏప్రిల్‌ 20న ధర రూ.4.50 లక్షలుగా నిర్ధారించారు.

అయితే రెండు సందర్భాల్లోనూ బిడ్డింగ్‌లో ఎవరూ పాల్గొనకపోవటం గమనార్హం. దీంతో మూడోసారి బస్సు వేలం నిర్వహించేందుకు సీసీఏ ప్రతినిధులు సిద్ధమయ్యారు. వచ్చే నెల 17, మధ్యాహ్నం 1 గంటలోగా ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ), డాక్యుమెంట్లను సమర్పించాలి. 18న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ పూర్తయ్యాక వచ్చిన నగదును దామాషా ప్రాతిపదికన బాధితులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇదీ కేసు.. 
ఓపీసీ కంపెనీ కరక్కాయ పొడి చేస్తే కమీషన్‌ ఇస్తామని నమ్మించి 425 మంది నుంచి రూ.3 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. ఈ కేసులో నిందితులు మాటూరి దేవ్‌రాజ్‌ అనిల్‌ కుమార్‌ అలియాస్‌ రాజన్, ముప్పాల మల్లికార్జున, వడ్డె వెంకయ్య నాయుడు అలియాస్‌ వెంకయ్యలను పోలీసులు అరెస్ట్‌ చేసి, రూ.59.5 లక్షల నగదు, 80 గ్రాముల బంగారం ఆభరణాలు, బైక్‌ స్వాధీనం చేసుకు న్నారు. గోల్డ్, బైక్‌ వేలం పూర్త యిన విషయం తెలిసిందే.

(చదవండి: నూకల పరిహారం ఎంతిద్దాం? )

మరిన్ని వార్తలు