జేసీ కుటుంబానికి మైనింగ్‌ శాఖ నోటీసులు

11 Oct, 2020 03:40 IST|Sakshi
శుక్రవారం భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద జేసీ దివాకర్‌రెడ్డి

తాడిపత్రి అర్బన్, రూరల్‌: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్‌ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్‌ మైనింగ్‌ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. విధుల్లో భాగంగానే మైన్స్‌ను తనిఖీ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని డీడీ పేర్కొన్నారు.

పోలీసులను అవహేళన చేయడంపై జేసీపై కేసు
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. విధి నిర్వహణలోని పోలీసులను అవహేళనగా మాట్లాడటంతో పాటు సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా.. వివిధ రకాల వ్యవస్థలను కించపరిచేలా వ్యాఖ్యానించడంపై ఆయనపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని మైన్స్‌ కార్యాలయం వద్ద విధుల్లో వున్న ఓ పోలీసు అధికారిని జేసీ అవహేళనగా మాట్లాడారు. అంతేకాక ప్రభుత్వంలోని పలు వ్యవస్థలపై బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. దీంతో పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జేసీపై కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు