నిత్య పెళ్లికొడుకు.. మైనర్‌ బాలిక హత్య

7 Feb, 2021 09:05 IST|Sakshi

పాపన్నపేట (మెదక్‌): ఇద్దరు భార్యల మొగుడు అతడు.. ముచ్చటగా మూడోసారి మైనర్‌ గిరిజన విద్యార్థిని ముగ్గులోకి దించాడు. నెలల తరబడి బాలికను వాడుకున్నాడు. హైదరాబాద్‌లోని వట్టి నాగులపల్లిలో కాపురం పెట్టాడు. ఆపై పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో మంజీరనదిలో తోసేసి బాలికను జల సమాధి చేశాడు. ఆపై దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతున్నాడు. ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా నిత్య పెళ్లికొడుకు పాపం పండింది. నాలుగు నెలల అనంతరం అతడు చేసిన ఘోరం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం సోమ్లా తండాకు చెందిన ఓ బాలిక పాపన్నపేట కేజీబీవీలో 9వ తరగతి వరకు చదివించారు. 2020లో టీసీ తీసుకొని ఎల్లుపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. ఈ క్రమంలో ఎల్లుపేటకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ పరిచయమయ్యాడు. రోజు ఉచితంగా ఆటోలో పాఠశాలకు తీసుకెళ్తూ.. ప్రేమలోకి దించాడు. అప్పటికే అతనికి అల్లాదుర్గంకు చెందిన ఓ మహిళతో వివాహం కాగా ఆమే అనుమానాస్పదస్థితిలో మరణించింది.

ఆపై న్యాల్‌కల్‌ మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా బాలికతో ప్రేమాయణం కొనసాగించి హైదరాబాద్‌లోని వట్టి నాగులపల్లిలో రూం తీసుకొని కాపురం కొనసాగించాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని బాలిక నిలదీయడంతో పాపన్నపేట మండలం గాజులగూడెం శివారులోకి తీసుకొచ్చి మంజీరా నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి ఆమెను తోసేసి జల సమాధి చేశాడు. అదే క్రమంలో 31అక్టోబర్‌ 2020న ఏడుపాయల్లోని మంజీరా నదిలో పోలీసులు గుర్తు తెలియని అమ్మాయి శవాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. అప్పటి వరకు బాలిక వెతికిన తల్లిదండ్రులు నవంబర్‌లో పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  వారు ఆటో డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతని ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించి ఆరా తీసి అనుమానాస్పద వ్యక్తిని విచారించగా అతడే హతమార్చినట్లు తెలిసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంజారా సంఘం నాయకులు రమేష్, పూల్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పాపన్నపేట ఎస్‌ఐని వివరణ కోరగా పోలీస్‌ అధికారులు అందుబాటులో లేనందున ఆదివారం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు