ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

5 Oct, 2021 02:21 IST|Sakshi
 వర్షిత (ఫైల్‌)   

నిందితుడిపై కేసు నమోదు 

ఖమ్మం క్రైం: ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను ఓ వ్యక్తి వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని తల్లాడ గ్రామానికి చెందిన కుసుమరాజు వర్షిత (17) తండ్రి మృతిచెందగా కుటుంబపోషణ నిమిత్తం స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో ఉంటోంది. ఇదే ఆస్పత్రిలో తిరువూరు మండలం మునుకోళ్లకు చెందిన మల్లవరపు మధుకుమార్‌ కూడా పనిచేస్తున్నాడు.

తనను ప్రేమించమని, కోరిక తీర్చాలని మధు ఆమెను వేధించేవాడు. దీనికితోడు ఆమె జీతం నుంచి డబ్బు తీసుకున్నాడు. వేధింపులు పెరగడంతో వర్షిత ఇటీవల మరో ఆస్పత్రిలో చేరింది. అయినా అప్పటికే పెళ్లి అయిన మధుకుమార్‌ వేధింపులు ఆగకపోగా.. ఆమెతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు రికార్డు చేసిన వాయిస్‌ను బయటపెడతానని బెదిరించసాగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఉదయం తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.

ఆ వెంటనే స్నేహితురాలు వర్షిత తల్లికి ఫోన్‌ చేయగా ఆమె ఖమ్మం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహం పక్కన ఇంజక్షన్, సిరంజీ ఉండడంతో విషం ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. టూటౌన్‌ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ రాములు మృతదేహన్ని అన్నం ఫౌండేషన్‌ బాధ్యుల సహకారంతో మార్చురీకి తరలించారు. మధుకుమార్‌పై పోక్సోతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.  నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.

మరిన్ని వార్తలు