ఏ దిక్కూలేక తాత ఇం‍టికి చేరింది.. మృగాళ్లలా మారి ఆరుగురు..

21 Dec, 2022 07:45 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

మేం.. విడిపోతున్నామనే పేరుతో తల్లిదండ్రులు వదిలేశారు. ఏ దిక్కూలేని ఆ పసితల్లి దీనంగా తాత ఇంటికి చేరింది. ఒక్కపూట బువ్వకోసం ఇంటి చాకిరీ మొత్తం చేసింది. ఆ బిడ్డను చూసి జాలిపడాల్సిన లోకం పట్టించుకోలేదు. దిక్కూమొక్కులేదని తెలియడంతో అయినా వారే ఆ చిన్నారి పాలిట రాబందులుగా మారారు. కర్కశంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కాటికి కాళ్లు చాపిన తాత.. తండ్రి తర్వాత తండ్రిగా భావించే బాబాయిలు, వరసకు సోదరులైన ఇద్దరు యువకులు తోడేళ్లుగా మారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటి బాధను పంటి బిగువన భరించిన ఆ 13 ఏళ్ల బాలిక టీచర్ల సాయంతో ఆ కీచకులను కటకటాలపాలు జేసింది.  

సాక్షి, అన్నానగర్‌: కంచే చేను మేసిందన్న చందంగా.. అయినా వారే ఓ ఆడబిడ్డ పాలిట జంతువుల్లా ప్రవర్తించారు. సభ్య సమాజం తలదించుకునేలా మృగాలను తలపించారు. వివరాలు.. మైలాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట వివాహం అనంతరం కొన్నేళ్లకు విడిపోయింది. దీంతో వీరి కుమార్తె (13) అనాథగా మారింది. నా అనేవాళ్లు లేక తాతయ్య ఇంటికి చేరింది. అక్కడే స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అయితే ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే 2016, 2017లో పలుమార్లు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులకు తెలియజేసింది. దీంతో పాఠశాల యాజమాన్యం జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఫిర్యాదు చేసింది. చివరికి ఈ అకృత్యంపై మైలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

మృగాలకు తగిన శాస్తి.. 
ఈ కేసు విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. బాలికపై ఏకంగా ఆరుగురు కుటుంబ సభ్యులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో బలాత్కారం చేసిన ఆమె తాత, ముగ్గురు బాబాయిలు (తాత కొడుకులు), చిన్నాన కుమారులు ఇద్దరు (బాలిక సోదరులు) సహా ఆరుగురిపై పోక్సో కేసు నమోదైంది. అనంతరం వారిని అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెన్నైలోని పోక్సో కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి ముందుకు మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కాగా నేరం రుజువు కావడంతో బాలిక తాత, ముగ్గురు బాబాయిలకు యావజ్జీవ శిక్ష, తలా రూ. లక్ష జరిమానా, బాలిక సోదరుల్లో ఒకరికి 10 ఏళ్ల జైలుశిక్ష, మరొకరికి ఐదేళ్ల జైలుశిక్ష, తలా రూ.5,000 జరిమానా విధించారు.

అలాగే బాధిత బాలికకు తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇక సమాజంలో ఏ ఆదరణ లేని బాలికల పరిస్థితి దుర్భరంగా ఉందని, తన..మన అనే భేదం లేకుండా ఇష్టారాజ్యంగా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అబలల ఆక్రందనలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, ఇలాంటి విషయాల్లో పోలీసులు సైతం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిందితులపై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు