మరో ట్విస్ట్‌ ఇచ్చిన అత్యాచార బాధితురాలు

3 Sep, 2020 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన మిర్యాలగూడకు చెందిన యువతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసి పోలీసుల శాఖను ముప్పుతిప్పలు పెట్టి.. రెండు రోజులకే మాట మార్చింది. ఆ తరువాత తనపై ఎవరూ అత్యాచారానికి పాల్పడలేదని రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ డాలర్‌ భాయ్‌ కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పేర్కొని కేసులో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం మరో ప్రకటన చేసింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని, 36 మంది మాత్రమే అత్యాచారం చేశారని పేర్కొంది. మొత్తం 53 మంది తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు తెలిపింది. డాలర్ బాయ్ తనను చిత్రహింసలకు గురిచేశాడని, తన బలవంతం మేరకే సెలబ్రిటీల పేర్లు చెప్పాల్సి వచ్చిందని వివరించింది. (ఎన్‌జీఓ డాలర్‌ భాయ్‌ ప్రధాన నిందితుడు!)

తొలుత డాలర్ బాయ్ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం వెళ్లానని, అప్పటి నుంచి తన గురించి తెల్సుకుని ఈ విధంగా వాడుకున్నాడని తెలిపింది. డాలర్ బాయ్ తన మీద అనేక రకాలుగా చిత్రహింసలకు పాల్పడ్డాడని, 36 మంది అత్యాచారం చేయడం మాత్రం వాస్తవమని స్పష్టం చేసింది. అతనితో తనకు ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్‌ భాయ్‌పై సీసీఎస్‌ మహిళా ఠాణాలో ఇదివరకే ఓ కేసు నమోదై ఉంది. ఇటీవల జరిగిన ఫోన్‌ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది. అయితే అప్పుడు ఆమె చెప్పిన వివరాలకు, తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన వాటికి చాలా తేడా ఉంది. దీంతో బాధితురాలి నుంచి మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. (డాలర్‌ బాయ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు)

మరిన్ని వార్తలు