అతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు!

12 Nov, 2021 06:58 IST|Sakshi
శ్రీకృష్ణ అలియాస్‌ శ్రీకి

క్రిప్టో కరెన్సీ మాస్టర్‌ మైండ్‌.. నాలుగో తరగతి నుంచే షురూ..

సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరువాసి శ్రీకృష్ణ అలియాస్‌ శ్రీకి పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు. శ్రీకి నుంచి రాజకీయ నేతలు, వారి సుపుత్రులు భారీగా బిట్‌కాయిన్ల డబ్బును స్వీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పెద్ద రాజకీయ కలకలం ఏర్పడింది.  ఇతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదంటారు. జయనగర నివాసి గోపాల్‌ రమేశ్‌  కుమారుడైన శ్రీకి అంతర్జాతీయ స్థాయి హ్యాకర్‌గా గుర్తింపు పొందాడు. తన ఆధారాలు చిక్కకుండా హ్యాక్‌ చేయడం ఇతని ప్రత్యేకత. ఇందుకోసం ఎప్పడూ సొంత ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్‌ఫోన్‌ను వాడింది లేదు.  

4వ తరగతి నుంచి షురూ..  
నాలుగో తరగతి చదువుతుండగానే మొబైల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసే నైపుణ్యం పొందిన శ్రీకి హైస్కూల్‌లో చేరేటప్పటికి ప్రముఖ హ్యాకర్‌గా గుర్తింపుపొందాడు. 17 ఏళ్లు వయసులోనే ఇళ్లు వదిలిపెట్టి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌కు పారిపోగా పోలీసులు కనిపెట్టి  తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఎప్పుడూ స్కూల్‌కి గైర్హాజరయ్యే ఇతడు తోటి విద్యార్థులు, పాఠశాల కంప్యూటర్‌లను హ్యాక్‌ చేసి ఔరా అనిపించేవాడు.

వీవీ పురం ప్రైవేటు కాలేజీలో పీయూసీ కంప్యూటర్‌ సైన్సు చదువుతుండగా ప్రపంచస్థాయి హ్యాకర్లతో పరిచయమైంది. పీయూసీ తరువాత ఉన్నత విద్య కోసం నెదర్లాండ్‌కు వెళ్లడంతో అందులో నిష్ణాతునిగా మారాడు. అక్కడి హ్యాకర్లతో గొడవలు వచ్చి తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు.  

పెద్దవాళ్లతో స్నేహం..  
తెలివితేటలను ఉపయోగించి నగరంలో ప్రముఖ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, సీనియర్‌ పోలీస్‌ అధికారులు, వారి పిల్లలతో స్నేహం పెంచుకున్నాడు. యుబీ సిటీలో ఎమ్మెల్యే హ్యారిస్‌ కుమారుడు నలపాడ్, విద్వత్‌ అనే యువకునిపై దాడిచేసిన సమయంలో శ్రీకి కూడా ఉన్నాడు. దాంతో కొన్నాళ్లు పరారయ్యాడు.  

డబ్బు కొల్లగొట్టి విలాసాలు.. 
బెంగళూరులో మకాం వేసి ప్రభుత్వ వెబ్‌సైట్లు, టెండర్లను హ్యాక్‌ చేసేవాడు. తద్వారా కోట్లాది రూపాయలను కొల్లగొట్టి స్టార్‌ హోటళ్లు, క్రూయిజ్‌ ఓడల్లో, విమానాల్లో విలాసంగా గడపడం ఇతని నైజం. అయితే గత జనవరిలో సీసీబీ పోలీసులు శ్రీకిని డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేయడంతో కష్టాలు మొదలయ్యాయి.

అప్పుడే క్రిప్టో కరెన్సీ దందా వెలుగుచూసింది. ఇతని అకౌంట్లలో ఉన్న సుమారు రూ.9 కోట్ల విలువచేసే బిట్‌కాయిన్ల సీజ్‌ చేశారు. కొన్నినెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలయ్యాడు.  

మరిన్ని వార్తలు