ఒకడు చోరీ.. మరొకడు కాపలా!

11 Aug, 2020 07:14 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను చూపిస్తున్న కమిషనర్‌ అంజనీకుమార్‌

 గోడకు కన్నం.. ఆపై సెల్‌ఫోన్లు చోరీ 

ఇద్దరిని పట్టుకున్న పోలీసులు 

రూ.14 లక్షల విలువైన 57 సెల్‌ఫోన్లు రికవరీ 

హిమాయత్‌నగర్‌: ఒకడు గోడకు కన్నం వేస్తాడు... మరొకడు బయట ఉండి కాపాలా కాస్తాడు... ఇలా ఇద్దరి సమన్వయంతో 57 కొత్త ఫోన్లను చోరీ చేసి ఇప్పుడు కటకటాలపాలయ్యారు. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించిన ఈ కేసులో రూ.14 లక్షల విలువ గల 57 స్మార్ట్‌ ఫోన్లు రికవరీ చేసినట్లు  నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. నిందితులు ఫయజుల్లాఖాన్‌ అలియాస్‌ ఖందా ఫయాజ్, సయ్యద్‌ మహబూబ్‌ అలీ అలియాస్‌ ఖుస్రూలను సోమవారం బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఏఆర్‌ శ్రీనివాస్‌ జాయింట్‌ సీపీ(వెస్ట్‌జోన్‌), అడిష్నల్‌ డీసీపీ టాస్క్‌ఫోర్స్‌ జి.చక్రవర్తిలతో కలిసి సీపీ మీడియా ఎదుట హాజరుపర్చారు. సీపీ  అంజనీ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఫయాజుల్లా ఖాన్‌ అలియాస్‌ ఖందా ఫయాజ్‌ 2014 నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు నగరంలోని మూడు కమిషనరేట్లలో 10కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిపై చాదర్‌ఘట్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ ఓపెన్‌ చేశారన్నారు. మరో నిందితుడు సయ్యద్‌ మహబూబ్‌ అలీ అలియాస్‌ ఖుస్రూ 14 అటెన్షన్‌ డైవర్షన్, సెల్‌ఫోన్‌ చోరీ కేసుల్లో నిందితుడు. ఇతడిపై చార్మినార్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ ఓపెన్‌ చేశారు.  ఇటీవల ఉప్పల్, చార్మినార్, నాంపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో టచ్‌ మొబైల్స్‌ చోరీ చేశారు. 

రాత్రి 11 గంటలకు తర్వాత... 
ఫయాజుల్లా ఖాన్‌ అలియాస్‌ ఖందా ఫయాజ్‌ సెల్‌ఫోన్లు చోరీ చేయడంలో దిట్ట. రాత్రి 11 గంటల తర్వాత ఫయాజుల్లా ఖాన్‌ అలియాస్‌ ఖందా ఫయాజ్, సయ్యద్‌ మహ్మద్‌తో కలిసి టార్గెట్‌ చేసిన సెల్‌ఫోన్‌ షాపు వద్దకు వెళ్తారు.  ఫయాజ్‌ షాపు వెనుక వైపు గోడకు కన్నం వేసి లోపలికి చొరబడి ఫోన్లు చోరీ చేస్తాడు. సయ్యద్‌  షాపు పరిసరాల్లో నిలబడి ఎవరైనా వస్తుంటే ఫోన్‌ ద్వారా ఫయాజ్‌కు తెలుపుతాడు. ఇలా వీరు కొంతకాలంగా సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నారు.   

కెమెరా కట్‌... యాక్షన్‌ 
గోడకు కన్నం వేసి లోపలికి వెళ్లిన ఫయాజుద్దీన్‌ ఖాన్‌ ముందుగా సీసీ కెమెరా వైర్‌ను తెంచేస్తాడు. ఆ తర్వాత కెమెరా వీవైఆర్‌ను ధ్వంసం చేస్తాడు. షోకేస్‌లో ఉన్న ఖరీదైన మొబైల్స్‌ను బ్యాగ్‌లో నింపుకొని బయటకు వస్తాడు.  వీటిని తనకు తెలిసిన వాళ్లకి మాయమాటలు చెప్పి విక్రయిస్తాడు.  ఇలా ఇప్పటి వరకు కొట్టేసిన రూ.14లక్షల విలువ గల 57 సెల్‌ఫోన్‌లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రికవరీ చేశారు. వీటిలో ఎక్కువగా ఒప్పో కంపెనీకి చెందిన సెల్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరిపై పీడీ యాక్ట్‌లు నమోదై ఉండగా, తాజాగా ఉప్పల్‌ ఠాణా పరిధిలో చేసిన ఈ చోరీ కేసులో కూడా మరోమారు వీరిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు