సెల్‌టవర్‌ నిర్మాణం అగ్రిమెంట్‌ పేరుతో మోసం..

28 Apr, 2021 10:10 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, జగిత్యాల: సాంకేతికరంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు కూడా సాంకేతికరంగాన్ని ఉపయోగిస్తూ బడా వ్యాపారుల నుంచి మొదలుకుని సామాన్య రైతులు, రైతు కూలీలను మోసం చేస్తున్నారు. తమ భూ మిలో సెల్‌టవర్‌ నిర్మిస్తామని నమ్మించి అగ్రిమెంట్‌ పేరుతో రూ.22,700 ఫోన్‌పే చేయించుకుని రైతును మోసం చేశారు. జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోడుగం బాపురెడ్డి అనే రైతుకు పొరండ్ల గ్రామ శివారులో రెండు స్థలాల్లో భూమి ఉంది. 10 రోజుల నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తమ భూమిని ఐడియా సెల్‌టవర్‌ నిర్మాణానికి 10 ఏళ్లపాటు అద్దెకివ్వాలని కోరాడు. తాము ల్యాండ్‌ కూడా చూశామని నమ్మించి రూ.20 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్‌ పెడతామని, నెలకు రూ.25 వేల అద్దె, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని నమ్మించారు.

దీంతో సోమవారం బాపురెడ్డికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి అగ్రిమెంట్‌ చార్జీలు రూ.5200 సెల్‌ నంబరు 8195911026కు ఫోన్‌ ద్వారా చెల్లించారు. తర్వాత వారు రైతుకు ఐటీ రిటర్న్‌ లేదని, ట్యాక్స్‌ పేరున రూ.17,500 జమచేస్తే బ్యాంక్‌ ఖా తాలో రూ.10 లక్షలు డిపాజిట్‌ చేస్తామని నమ్మించారు. రూ.17,500 జమచేసిన తర్వాత బ్యాంక్‌లో రూ.10 లక్షలు జమకాకపోవడంతో రైతు వారికి ఫోన్‌ చేయగా బ్యాంక్‌ డబ్బులు జమచేసినట్లు ఓ నకిలీ రశీదును పంపించారు. “మరో రూ.25 వేలు చెల్లిస్తే ఖాతాలో అరగంటలో రూ.10 లక్షలతో పాటు మీరు వేసిన రూ.25 వేలు మీ ఖాతాలోనే జమ అవుతాయి’ అని నమ్మించారు. కానీ రైతు అనుమానం వచ్చి వారు పంపించిన డాక్యుమెంట్లు పరిశీలించగా మోసపోయామని తెలుసుకున్నాడు. దీంతో అతడు సోమవారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  

మరిన్ని వార్తలు