బాలికపై సామూహిక అత్యాచారం

4 Jun, 2022 04:15 IST|Sakshi

హైదరాబాద్‌లో రొమేనియా బాలికపై అఘాయిత్యం

జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ నుంచి ఇంట్లో డ్రాప్‌ చేస్తామంటూ తీసుకెళ్లి దారుణం

గల్లీలో కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం

తిరిగి పబ్‌ వద్ద వదిలేసి వెళ్లిన ఐదుగురు నిందితులు

మొదట భయంతో లైంగికంగా వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక

‘భరోసా’లో వాంగ్మూలం, వైద్య పరీక్షల ద్వారా రేప్‌ జరిగినట్టు నిర్ధారణ

నిందితుల్లో ఇద్దరు మేజర్లు, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడు సహా ముగ్గురు మైనర్లు

ఒకరు అరెస్టు, పోలీసుల నిఘాలో మరొకరు.. మిగతావారి కోసం గాలింపు

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కారులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పబ్‌ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు.. నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆందోళనకు లోనైన బాలిక ముభావంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం.. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది.

నిందితుల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మసీవుల్లాఖాన్‌ కుమారుడు, మరో ఇద్దరు మైనర్లుకాగా.. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్‌ మాలిక్‌ (18), బంజారాహిల్స్‌కు చెందిన ఉమేర్‌ఖాన్‌ ఉన్నారు. వీరిలో సాదుద్దీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మసీవుల్లాఖాన్‌ కుమారుడి ఆచూకీ గుర్తించారు. అతడు మైనర్‌ కావడంతో శనివారం ఉదయం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అప్పటివరకు అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా వేసి ఉంచారు. ఇక ఉమేర్‌ ఖాన్, మరో ఇద్దరు మైనర్ల కోసం గాలిస్తున్నారు. వీరిలో సంగారెడ్డికి చెందిన ఓ కార్పోరేటర్‌ కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. 

ఏం జరిగింది?

  • మే 28న కొందరు విద్యార్థులు జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్నారు. కొందరు స్నేహితులూ ఆ పార్టీకి వచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బాలిక పబ్‌కు వెళ్లింది.
  • పబ్‌లో ఐదుగురు వ్యక్తులు ఆ బాలికతో మాటలు కలిపారు. ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్‌ వేసుకున్నారు. ఇంటి దగ్గర దింపుతా మంటూ కారు ఎక్కించుకున్నారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి ప్రాంతంలోని గల్లీల్లోకి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి పబ్‌ వద్ద వదిలేసి వెళ్లారు.
  • ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. తనను కొందరు వేధించారని చెప్పడంతో 31న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది.
  • దీంతో రేప్‌ సెక్షన్లను నమోదు చేసిన పోలీసులు..  నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. ఒకరిని అరెస్టు చేసి మరొకరిపై నిఘా పెట్టారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 

కాలేజీ పార్టీకని వెళ్లి.. 
బంజారాహిల్స్‌లో నివాసముండే రొమేనియా దేశానికి చెందిన బాలిక (17) ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న హాదీ అనే యువకుడితో బాలిక కుటుంబానికి పరిచయం ఉంది. అతడు చదువుకుంటున్న ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని అమ్నీషియా ఇన్సోమియా పబ్‌లో ఫ్రెషర్స్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దానికి తనతోపాటు రమ్మని హాదీ బాలికను ఆహ్వానించాడు. గత నెల 28న మధ్యాహ్నం 1.30 గంటలకు హాదీతోపాటు సూరజ్‌ అనే స్నేహితుడితో కలిసి బాలిక అమ్నీషియా పబ్‌కు వెళ్లింది. ఇది నాన్‌ ఆల్కహాలిక్, నాన్‌ స్మోకింగ్‌ పార్టీగా విద్యార్థులు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రచారం చేసుకున్నారు.

మొత్తం 150 మంది వరకు వస్తారంటూ కాలేజీ నుంచి లెటర్‌ తీసుకువచ్చినప్పటికీ 182 మంది వచ్చారు. వీరిలో సదరు కాలేజీ విద్యార్థుల స్నేహితులు కూడా ఉన్నారు. రొమేనియన్‌ బాలిక స్నేహితులతో కలిసి సాయంత్రం 5.30 గంటల దాకా పబ్‌లో గడిపింది. ఈ సమయంలో ఆమెకు సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మిగతా ముగ్గురు మైనర్లు (మసీవుల్లాఖాన్‌ కుమారుడు సహా)తో పరిచయమైంది. అయితే ఈ ఐదుగురూ పబ్‌కు తమ వెంట తెచ్చుకున్న మద్యం తాగినట్టు సమాచారం. పార్టీ ముగిశాక హాదీ బిల్లు చెల్లించే పనిలో ఉండగా.. సాదుద్దీన్, ఉమేర్, మిగతా ముగ్గురు తాము ఇంటివద్ద దింపుతామంటూ ఆ బాలికను బయటికి తీసుకువచ్చారు. అప్పటికే ఆ బాలికపై అఘాయిత్యానికి పథకం వేసుకున్నారు. 

పథకం ప్రకారం కారులో ఎక్కించుకుని.. 
పబ్‌ బయట కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు ఎరుపు రంగు బెంజ్‌ కారులో బాలికను ఎక్కించుకుని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని కాన్‌సీయూ బేకరీకి తీసుకొచ్చారు. మిగతా ఇద్దరు ఇన్నోవా కారులో వారిని అనుసరించారు. అందరూ బేకరీలో దాదాపు 20 నిమిషాలపాటు ఉన్నారు. తర్వాత బెంజ్‌ కారును అక్కడే వదిలేశారు. ఐదుగురూ ఇన్నోవా కారులో బాలికను ఎక్కించుకున్నారు. బాలికను ఇంటివద్ద దింపుతామంటూ.. పెద్దమ్మ గుడి సమీపంలోని గల్లీల్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారు అద్దాలన్నీ మూసేసి.. ఒకరి తర్వాత ఒకరుగా కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు గంటసేపటి తర్వాత ఆమెను తీసుకుని బయలుదేరారు.

రాత్రి 7.30 గంటల సమయంలో అమ్నీషియా పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో పబ్‌లోకి వెళ్లిన బాలిక.. తన జాకెట్‌ మర్చిపోయానంటూ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి తీసుకువెళ్లింది. అయితే.. ఇంటికి వెళ్లిన బాలిక ఆందోళనతో రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయింది. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో.. తనతో ఐదుగురు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. ఈ మేరకు బాలిక తండ్రి గత నెల 31న సాయంత్రం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

బాలిక వాంగ్మూలం, వైద్య పరీక్షలతో.. 
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. వైద్య పరీక్షల సందర్భంగా, మహిళా అధికారులు, నిపుణులు వాంగ్మూలాన్ని సేకరించిన సమయంలో.. తనపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని బాలిక బయటపెట్టింది. దీని ఆధారంగా పోలీసులు.. కేసును మార్చి ఐపీసీ 376 (డి), పోక్సో యాక్ట్‌లోని కొన్ని సెక్షన్లను జోడించారు. బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. అమ్నీషియా పబ్, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి.. బాలికతోపాటు ఉన్నవారు ఎవరనేది ఆరా తీశారు.

పబ్‌ నుంచి బంజారాహిల్స్‌లోని బేకరీ దాకా రెండు వాహనాలు రావడం, బేకరీ వద్ద సుమారు 20 నిమిషాలు ఆగడం, ఐదుగురు యువకులతో కలిసి బాలిక కారు బయలుదేరడం వంటివన్నీ పరిశీలించారు. సాదుద్దీన్, ఉమేర్‌ఖాన్, మసీవుల్లాఖాన్‌ కుమారుడు సహా ఐదుగురిని నిందితులుగా గుర్తించారు. వారు ఏ దారిలో ప్రయాణించారు, ఎక్కడ కారు ఆపి లైంగిక దాడికి పాల్పడ్డారనేది గుర్తించేందుకు.. నిందితుల ఫోన్‌కాల్స్, టవర్‌ లొకేషన్, బాలిక ఫోన్‌ లొకేషన్‌ల ఆధారంగా విచారణ చేస్తున్నారు. 

ఓ ఎమ్మెల్యే కుమారుడిపై అనుమానాలు! 
అమ్నీషియా పబ్‌ నుంచి బాలికతో కలిసి బయలుదేరిన వారిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ప్లాన్‌లో అతనూ భాగమేనని.. అయితే బేకరీ వద్ద బాలికను కారు ఎక్కించుకునే సమయంలో ఓ ఫోన్‌కాల్‌ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని సమాచారం. ఈ విషయంపై పోలీసులు స్పందించడం లేదు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఓ మీడియా సంస్థ యజమాని కుమారుడి సమాచారంతో
అమ్నీషియా పబ్‌లో పార్టీకి హాజరైనవారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేదు. అంతా ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా స్నేహితులైన వారు కావడంతో నిందితులను గుర్తించడం కష్టమైం దని పోలీసువర్గాలు చెప్తున్నాయి. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు.. నిందితులు 29న (అఘాయిత్యానికి పాల్పడిన తర్వాతి రోజు) మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన ఓ మీడియా సంస్థ కార్యాలయానికి వెళ్లి, దాని యజమాని కుమారుడిని కలిసినట్టు గుర్తించారు. అతడిని ప్రశ్నించగా.. ఐదుగురు నిందితులు తనవద్దకు వచ్చి అఘాయిత్యం విషయం చెప్పారని వెల్లడించినట్టు తెలిసింది. కానీ తాను సహకరించబోనని వారికి స్పష్టం చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే పోలీసులు ఈ మీడియా యజమాని కుమారుడి సాయంతోనే నిందితులను గుర్తించినట్టు తెలిసింది. 

హోంమంత్రి మనవడికి సంబంధం లేదు 
రొమేనియన్‌ బాలికపై అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడికి ఎలాంటి సంబంధం లేదు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడి పాత్రపై ఆధారాలు లభించాయి. అతడి ఆచూకీ కనిపెట్టినా రాత్రివేళ మైనర్లపై చర్యలు తీసుకోవడానికి చట్టం అంగీకరించదు. అతడిపై ప్రత్యేక బృందంతో నిఘా ఉంచాం. శనివారం చర్యలు తీసుకుంటాం. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నాం.

మిగతా ముగ్గురు నిందితులను 48 గంటల్లో పట్టుకుంటాం. బాలిక పూర్తిగా కోలుకున్నాక ఆమెతో కోర్టులో వాంగ్మూలం నమోదు చేయిస్తాం. మరెవరి పాత్ర అయినా ఉన్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ఎంతవారైనా వదిలి పెట్టేది లేదు. ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అత్యాచారం చేసిన సమయంలో వీడియో తీసినట్టుగానీ, దాన్ని చూపిస్తామని బెదిరించినట్టుగానీ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. – జోయల్‌ డెవిస్, హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ  
 

మరిన్ని వార్తలు