యాసిడ్‌ పోసి.. గొంతు కోసి.. 

6 Sep, 2022 05:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గుర్తు తెలియని వ్యక్తి అత్యాచార యత్నం.. ప్రతిఘటించిన బాలిక 

యాసిడ్‌తో దాడిచేసి.. కత్తితో పొడిచి పరార్‌ 

నెల్లూరు జిల్లాలో దారుణం 

వెంకటాచలం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో గుర్తుతెలియని ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై పోసి, కత్తితో గొంతు కోసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీకి చెందిన 14ఏళ్ల బాలిక బుజబుజ నెల్లూరులోని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి యత్నించాడు.

ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విషయం తెలుసుకున్న సీఐ గంగాధర్, ఎస్‌ఐ అయ్యప్ప నక్కలకాలనీ, ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి విచారించారు. అయితే.. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఒక్కరా, లేక ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు