రక్షకుడే భక్షకుడై దారుణకాండ

3 Jul, 2022 07:53 IST|Sakshi

బనశంకరి: నగరంలో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీఆర్‌ శ్రీనివాస్‌పై అత్యాచారం, బెదిరింపులు ఆరోపణలతో నమోదైన కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఆ ఎస్‌ఐ భార్య ముబషిరా హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్నతో కూడిన ఏకసభ్యపీఠం ప్రతివాదులైన డీజీపీ, నగర పోలీస్‌కమిషనర్, సీబీఐ, జేసీ నగర పోలీస్‌స్టేషన్‌ సీఐకి, అలాగే ఎస్‌ఐ టీఆర్‌ శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేసింది.  

రాజీకి రావాలని బెదిరించారు  
జూన్‌ 1వ తేదీనే తన భర్త దాష్టీకాలపై ఫిర్యాదు చేసినప్పటికీ జేసీ నగర సీఐ దర్యాప్తు చేపట్టలేదని, పైగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారని, అప్పటికీ లొంగలేదని డబ్బు ఆశచూపించి రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమైంది. 5వ తేదీన డీసీపీ జోక్యం చేసుకోవడంతో శ్రీనివాస్‌పై అత్యాచారం, బెదిరింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదేరోజు జేసీ నగర సీఐ, ఎస్‌ఐ శ్రీనివాస్‌ కలిపి ఫిర్యాదుదారులపై బ్లాక్‌మెయిల్‌ అని ఎదురు కేసు పెట్టారు.  

ఏమిటీ కేసంటే..  
కేసు ఏమిటంటే... టీఆర్‌ శ్రీనివాస్‌ వసంతనగర పోలీస్‌ కమిషనరేట్‌ ఆఫీసులో ఎస్‌ఐగా ఉద్యోగం చేస్తున్నారు. 2005లో అల్లాబకాష్‌ అనే వ్యక్తితో ముబ షిరాకు పెళ్లయింది. భర్త వేధిస్తున్నాడని శివాజీనగర మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. తరువాత ఇద్దరూ విడిపోగా, ముబషిరాకు ఎస్‌ఐ శ్రీనివాస్‌తో స్నేహం ఏర్పడింది. మంచి జీవితం కల్పిస్తానని ఆశ చూపి 2013లో తనను పెళ్లి చేసుకున్నాడని ముబషిరా పేర్కొంది. 2014 నుంచి 2022 వరకు టీఆర్‌ శ్రీనివాస్‌ తనపై పాల్పడిన దౌర్జన్యాలను ఫిర్యాదులో వివరించింది. మొదటి భర్త ద్వారా కలిగిన తన ఇద్దరు  కుమార్తెలపై శ్రీనివాస్‌ అత్యాచారానికి పాల్పడేవాడని ఆరోపించింది.

అంతేగాక తన సహోదరిపై కూడా లైంగికదాడికి ఒడిగట్టాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందని తెలిపింది.  తాను గర్భవతిగా ఉండగా తీవ్రంగా కొట్టాడని, దీంతో గర్భస్రామైందని తెలిపింది. ఈ అరాచకాలపై ప్రశ్నించానని దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. అమానుషంగా ప్రవర్తించేవాడని, నీలిచిత్రాలు చూడాలని ఒత్తిడి చేసేవాడన్నారు. అలాంటివి చూడొద్దని చెప్పగా, చేతులు కట్టేసి కొట్టాడని వాపోయింది. 

(చదవండి: మహారాష్ట్రలో కెమిస్ట్‌ దారుణ హత్య)

మరిన్ని వార్తలు