అత్యాచార వీడియో ఒకరి నుంచి ఒకరికి.. ఐదుగురికి యావజ్జీవం

10 Nov, 2021 08:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అనంతపురం లీగల్‌/ పెద్దవడుగూరు: వివాహితపై అత్యాచారం కేసులో ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం నాల్గో అదనపు జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.  వివరాలిలా ఉన్నాయి.  పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌ అనే యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై 2014 జూన్‌ రెండో తేదీన ముప్పాలగుత్తి వైపు వస్తున్నారు. అదే సమయంలో కదరగుట్టపల్లికి చెందిన మహిళ పశువులకు గడ్డి కోసం పొలంలోకి వెళ్తుండగా అటకాయించారు. ఆమెను సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. జరిగిన ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోను బయట పెడతామని బెదిరించి.. అక్కడి నుంచి ఉడాయించారు.  

వీడియో వైరల్‌తో వెలుగులోకి.. 
అత్యాచార వీడియోను ఆ యువకులు నల్లబోతుల శివకృష్ణ మూర్తి, బోయ రామాంజనేయులుకు పంపారు. అలా ఒకరి నుంచి ఒకరికి వీడియో వెళ్లి.. విషయం వెలుగులోకి రావడంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 07–06–2014న ఐదుగురిని అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. 14–07–2014న మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలిని బైక్‌పై తీసుకెళ్తుండగా చూసిన సాక్షులు, బాధితురాలు ఏడుస్తూ తిరిగొస్తుండగా చూసిన వారి సాక్ష్యాలతో కేసు బలపడింది. నిందితుల మొబైల్‌ ఫోన్లలోని వీడియో క్లిప్పింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన చోట ఆధారాలను సేకరించారు.

కేసు విచారణలో ఉండగానే నల్లబోతుల శివకృష్ణమూర్తి అలియాస్‌ రామకృష్ణ, బోయ రామాంజనేయులు అలియాస్‌ రాంబాబు అనారోగ్యంతో చనిపోయారు. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌లకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధిస్తూ అనంతపురం నాల్గో అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.సునీత మంగళవారం తీర్పు చెప్పారు. ముద్దాయిలు చెల్లించే జరిమానా మొత్తం బాధితురాలికి చెందాలని తీర్పులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు