వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు

29 May, 2021 05:40 IST|Sakshi

నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు

పుంగనూరు(చిత్తూరు జిల్లా): ఓ దళిత వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని రాళ్లతో, కట్టెలతో కొట్టి చంపిన ఘటన శుక్రవారం పుంగనూరు మండలం అప్పిగానిపల్లెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అప్పిగానిపల్లెకు చెందిన వృద్ధురాలు సమీపంలోని వనమలదిన్నె గ్రామానికి వెళ్లి మినీ బ్యాంకులో నగదు డ్రా చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన గురుమూర్తి(47) ఆమెను అనుసరించి.. ఎవరూ లేని సమయంలో వనమలదిన్నె సమీపంలోని సబ్‌స్టేషన్‌ వెనుక పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు.

అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు కమ్మలు, చైను, ముక్కు పుడక లాక్కెళ్లాడు. బాధితురాలు స్పృహ కోల్పోయింది. కొన్ని గంటల తర్వాత  తీవ్ర గాయాలతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పింది. అనంతరం స్థానికులు ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. గ్రామ సమీపంలో తచ్చాడుతున్న నిందితుడు గురుమూర్తిని పట్టుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. డీఎస్పీ గంగయ్య, సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

గురుమూర్తికిది అలవాటే..
వనమలదిన్నెకు చెందిన గురుమూర్తి గతంలోనూ మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతనిపై పుంగనూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. గురుమూర్తి ఒంటరి మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అతని భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు.  

మరిన్ని వార్తలు