హైటెక్‌ చోరీ: ఏటీఎం నుంచి డ్రా.. కానీ, లెక్కల్లో తేడా రాదు

28 Jun, 2021 07:40 IST|Sakshi

మూడు ఖాతాల సీజ్‌ 

హర్యానాలో మరొకరి అరెస్టు 

సాక్షి, చెన్నై : ఎస్‌బీఐ డిపాజిట్‌ మిషన్‌లో నగదు తస్కరించిన హైటెక్‌ ముఠా కోటక్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ మెషిన్లలో డిపాజిట్‌ చేసినట్టు విచారణలో తేలింది. ఈ ముఠా సభ్యుడిని హర్యానాలో  ఆదివారం అరెస్టు చేశారు. ఎస్‌బీఐ ఏటీఎం డిపాజిట్‌ మెషిన్లలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని హైటెక్‌ చేతివాటం ప్రదర్శించిన విషయం గత వారం చెన్నైలో వెలుగు చూసింది. ఏటీఎంలలో చాకచక్యంగా నగదు డ్రా చేసినట్టుగా చేసి, సెన్సార్లను పనిచేయనివ్వకుండా ఆ నగదు మళ్లీ లోనికి వెళ్లినట్టుగా లెక్కల్లో సూచించేలా హెటెక్‌ చేతివాటం ప్రదర్శించారు. దీనిపై ఇద్దరు ఐపీఎస్‌ అధికారులతో కూడిన బృందం ఢిల్లీ, హర్యానాల్లో తిష్ట వేసి ఈ ముఠా కోసం గాలిస్తోంది.

తొలుత సమీర్‌ అనే యువకుడిని అరెస్టు చేసి చెన్నైకి తీసుకొచ్చారు. పోలీసు కస్టడీలో ఉన్న అతడు ఇచ్చిన సమాచారంతో వీరేందర్‌ అనే యువకుడిని ఆదివారం అరెస్టు చేసి తరమణి స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. విమానాల్లో ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి వెళ్లడమేకాకుండా డిపాజిట్‌ మెషిన్లు ఉన్న ఏటీఎంలను గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా గుర్తించినట్టు తేలింది. ఈ క్రమంలో వారు వలసరవాక్కం సమీపంలోని లాడ్జిలో అద్దెకు దిగి అద్దె బైక్‌లో తిరుగుతూ మూడు నాలుగు రోజుల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు గుర్తించారు.

ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రూ.80 లక్షలు చోరీ చేసి తరమణిలోని కోటక్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ మెషిన్‌ ద్వారా తన తల్లి పేరిట ఉన్న ఖాతాలోకి సమీర్‌ డిపాజిట్‌ చేయడం గమనార్హం. ఇతడి వద్ద నుంచి పలు బ్యాంక్‌లకు చెందిన ఏటీఎం కార్డుల్ని పోలీసులు సీజ్‌ చేశారు. అలాగే మూడు ఖాతాల్ని స్తంభింపజేశారు. ఈ ముఠా రాకెట్‌ అతి పెద్దదని, హర్యానా కేంద్రంగా పనిచేస్తున్నట్టు విచారణలో తేలింది.
చదవండి: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య

మరిన్ని వార్తలు