బ్యాంకు వద్ద తుపాకితో సన్యాసి హల్‌చల్‌...లోన్‌ ఇస్తావా? లేదా?..బెదిరింపులు

20 Sep, 2022 12:41 IST|Sakshi

చెన్నై: ఒక బ్యాంకు వద్ద సన్యాసి తుపాకితో హల్‌ చల్‌ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లో చోటు చేసుకుంది. ఒక సన్యాసి రైఫిల్‌ చేతపట్టుకుని బ్యాంకు ఉద్యోగులపై బెదరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తిరుమలై స్వామి అనే సన్యాసి తిరువారూర్ జిల్లాలోని మూలంగుడి గ్రామ నివాసి. ఆ సన్యాసి తన కుమార్తె చదువు కోసం లోన్‌ కావాలంటూ ఒక ప్రైవేట్‌ బ్యాంకు వద్దకు వచ్చాడు. తన కూతురు చైనాలో మెడిసిన్‌ చదివేందుకు లోన్‌ కావాలని అడిగాడు.

అందుకు హామీ పత్రాలు సమర్పించాల్పి ఉంటుందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐతే సన్యాసి డాక్యుమెంట్స్‌ సబ్మిట్‌ చేసేందుకు నిరాకరించాడు. తానే వడ్డితో సహా కట్టేస్తాను కాబట్టి హామీ పత్రాలు ఎందుకంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అధికారులు వివరంగా చెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నాడు. చేసేదేమి లేక బ్యాంకు అధికారుల లోన్‌ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు.

దీంతో సన్యాసి ఇంటికి వెళ్లి తుపాకిని తీసుకుని లోన్‌ ఇస్తారా? లేదా? అని ఉద్యోగులను బెదిరించడం ప్రారంభించాడు. సామాజిక మాధ్యమాల్లో సైతం సదరు సన్యాసి లోన్‌ ఇవ్వనందుకు బ్యాంకును లూటీ చేస్తానంటూ లైవ్‌ వీడియోని పోస్ట్‌ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు సన్యాసిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 

(చదవండి: ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం)

మరిన్ని వార్తలు