నామకరణం వేళ విషాదం.. తండ్రి చేతుల్లోంచి ఎత్తుకెళ్లి చంపిన కోతులు

18 Jul, 2022 08:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ బరేలీ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలోంచి అతని నాలుగు నెలల పసికందును ఎత్తుకెళ్లిన కోతులు.. భవనం నుంచి కింద పడేశాయి. ఈ దుర్ఘటనలో చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. 

శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలీలోని డుంకా ప్రాంతంలో బాధిత కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తి తన బిడ్డను ఎత్తుకుని బిల్డింగ్‌ పైన నడుస్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన ఓ కోతుల గుంపు అతనిపై దాడి చేసింది. అతన్ని తీవ్రంగా గాయపరిచి.. బిడ్డను ఎత్తుకెళ్లాయి. 

సాయం కోసం అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. వాళ్ల మీదా కోతులు దాడికి పాల్పడ్డాయి. పలువురిని కరిచాయి. దీంతో కొందరు రాళ్లు, కర్రలు విసరడంతో గందరగోళంలో ఆ కోతులు బిడ్డను కిందకు విసిరేశాయి. మూడంతస్తుల బిల్డింగ్‌ కావడంతో బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. 

నామకరణం  వేడుక కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఇది జరగడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. షాహీ పోలీసులతో పాటు ఈ ఘటనపై స్థానిక అటవీ శాఖ దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు