సన్యాసుల వేషంలో వచ్చి.. బాలికల కిడ్నాప్‌నకు యత్నం 

17 Sep, 2021 04:00 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

తప్పించుకున్న బాలికలు 

పోలీసుల అదుపులో నిందితులు 

మెరకముడిదాం: పాఠశాలకు వెళుతోన్న ఇద్దరు బాలికలను సన్యాసి వేషంలో ఆటోలో భిక్షాటనకు వచ్చిన కొందరు అటకాయించి కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. పోలీసులు, బాలికలు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఊటపల్లికి చెందిన ఇద్దరు బాలికలు మెరకముడిదాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వీరు గురువారం ఉదయం సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. గాదెల మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి అక్కడ సన్యాసి వేషాల్లో ఉన్న కొందరు వీరిని అడ్డగించే యత్నం చేశారు. బాలికలు కాస్త వేగంగా సైకిళ్లు తొక్కడంతో కొద్ది దూరం వెంబడించారు. అదే సమయంలో ప్రయాణికులతో కూడిన ఆటో అటువైపుగా రావడాన్ని గమనించిన సన్యాసులు వెనుదిరిగారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆటో 

బాలికలు వేగంగా మెరకముడిదాం చేరుకుని విషయాన్ని స్థానికులకు తెలిపారు. మెరకముడిదాం, ఊటపల్లి వాసులు అప్రమత్తమై మెరకముడిదాంకు సమీపంలో సన్యాసులను పట్టుకుని బుదరాయవలస పోలీసులకు అప్పగించారు. రెండు ఆటోలతో పాటు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఏడాది కిందట పార్వతీపురానికి చేరుకున్న వీరు కొన్నాళ్లు తగరపువలసలోను, 3 రోజుల కిందట బాడంగి వచ్చి  భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు ఆడపిల్లలు, ఐదుగురు మగవారు ఉన్నారు. వీరి ఆధార్‌ కార్డులను పరిశీలించగా వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, విచారిస్తున్నామని, కిడ్నాప్‌కు ప్రయత్నించినట్టు తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ సీహెచ్‌ నవీన్‌ పడాల్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు