బాక్సర్‌ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు..

4 Apr, 2021 22:18 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన ఓ కుర్రాడు..  చెడు సహావాసాలు, వ్యసనాల కారణంగా బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకొని గ్యాంగ్‌స్టర్‌గా మారి, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలోకెక్కాడు. హర్యానాలోని సోనేపట్ జిల్లా గానౌర్‌ గ్రామానికి చెందిన దీపక్ పహల్‌ అనే 25 ఏళ్ల యువకుడు, చిన్నప్పటి నుంచి బాక్సర్‌ కావాలని కలలుకన్నాడు. అయితే చెడు సహవాసాల కారణంగా అతను ట్రాక్‌ తప్పాడు. బాక్సింగ్ రింగ్‌లో రికార్డులు సృష్టించాల్సిన అతను ప్రస్తుతం పోలీసు రికార్డుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా నిలిచాడు. కిడ్నాప్‌, మర్డర్‌ సహా పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనిపై పోలీసులు 2లక్షల రివార్డు ప్రకటించారు. 

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనేపట్ జిల్లాకు చెందిన దీపక్ పహల్‌, చిన్నతనం నుంచి బాక్సింగ్‌ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. అతనికి 12 ఏళ్ల వయసున్నప్పుడు బీజింగ్‌ ఒలంపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. విజేందర్ సింగ్‌ను స్పూర్తిగా తీసుకున్న అతను.. ఎలాగైనా ఆ స్థాయికి చేరాలని స్థానిక బాక్సింగ్ క్లబ్‌లో సాధన చేయడం మొదలు పెట్టాడు. దీపక్‌లోని ప్రతిభను గమనించిన కోచ్ అనిల్ మాలిక్ అతనికి కఠినమైన శిక్షణను అందించాడు. దీంతో క్లబ్‌లో చేరిన మూడేళ్లకే 2011లో అతను జూనియర్ స్థాయిలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆతరువాత జాతీయ బాక్సింగ్‌ జట్టులో స్థానం సంపాదించిన అతను  భారత్ తరఫున ఎన్నో పతకాలు సాధించాడు. అయితే చెడు స్నేహాల కారణంగా దీపక్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. 

నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం అతన్ని ఢిల్లీలో గోగి అనే గ్యాంగ్‌స్టర్ వద్దకు చేర్చింది. గోగి.. ఉత్సాహవంతులైన కుర్రాలను చేరదీసి, ఒక ముఠాగా మార్చి సుపారీ హత్యలు చేయించేవాడు. దీపక్‌ స్వతాహాగా చురుకైన కుర్రాడు కావడంతో‌ కొద్ది కాలంలోనే గోగి బృందంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు. హత్యలు, దొమ్మీలలో ఆరితేరిపోయాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం పెరోల్‌పై బయటకు వచ్చిన అతను.. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. 

ఈ క్రమంలో ఓ హత్య కేసుకు సంబంధించి గోగీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీ నుంచి గోగిని తప్పించడానికి పహల్ ఏకంగా పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. గత వారంలో గోగిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దీపక్‌ మార్గమధ్యంలో కాల్పులు జరిపాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గోగి మరణించగా, దీపక్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం దీపక్‌పై ఢిల్లీ పోలీసులు 2 లక్షల రివార్డును ప్రకటించారు. కొడుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారడంపై తల్లి, కోచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపక్‌ సాధించిన పతకాలు చూసి అతని తల్లి కన్నీరుమున్నీరవుతుంది. ఏదో ఒక రోజు దేశమంతా నా గురించి మాట్లాడుకోవాలని చెప్పిన కుర్రాడు చివరికి ఇలా తయారవుతాడని ఊహించలేదంటున్నాడు కోచ్ అనిల్ మాలిక్.

మరిన్ని వార్తలు