సోషల్‌ యాప్‌లే అతడి అడ్డా: యువతులతో నగ్నంగా..

2 Aug, 2021 10:53 IST|Sakshi
నిందితుడు ప్రసన్న కుమార్‌

వ్యసనాలకు బానిసై చోరీల బాట

ఎన్నెన్నో మోసాలతో సులువుగా సంపాదన

కిలాడి దొంగ అరెస్టు

రూ.1,26,000 నగదు, 30 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ

కడప అర్బన్‌ : ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంతిరెడ్డి, అలియాస్‌ రాజారెడ్డి, అలియాస్‌ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. కడప డీఎస్పీ బూడిద సునీల్‌ ఆదివారం వివరాలు వెల్లడించారు. ప్రసన్నకుమార్‌ చిన్నవయసులోనే వ్యసనాలకు బానిసయ్యాడు. బీటెక్‌ మొదటి సంవత్సరంలోనే చదవు మానేశాడు. జల్సాలకు కావాల్సిన డబ్బుల కోసం 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు సీఎస్‌ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు.


వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) నిందితుడు ప్రసన్న కుమార్‌

  • ప్రసన్నకుమార్‌కు కడప నబీకోటకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి షేర్‌చాట్‌ ద్వారా 2020 డిసెంబర్‌లో పరిచయం అయ్యాడు. శ్రీనివాసుతో తన పేరు ప్రశాంత్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అని, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో పనిచేస్తానని, అక్కడ చాలామంది తెలుసునని నమ్మబలికాడు. శ్రీనివాసుకు అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని అతని తల్లిని నమ్మించాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించాలని డబ్బులు కావాలని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి డబ్బు ఇచ్చింది. తరువాత ప్రశాంత్‌రెడ్డికి శ్రీనివాస్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు.
  • జూలై 29న కడప అక్కాయపల్లెలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 30 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవి రింగులను దొంగిలించుకుని వెళ్లాడు.
  • ప్రసన్నకుమార్‌ను పోలీసులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అల్లరి, చిల్లరగా తిరిగేవాడు. కడప, విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, మధ్య వయసు మహిళలను టార్గెట్‌ చేసేవాడు. వారితో పరిచయం చేసుకుని ప్రేమలోకి దించి, వారితో అసభ్యకరరీతిలో చాటింగ్‌ చేసేవాడు. వారికి తెలియకుండా వివస్త్ర రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సేవ్‌ చేసుకుంటాడు. తద్వారా వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి నుంచి తన గూగుల్‌పే, ఫోన్‌ పేల ద్వారా డబ్బులను వసూలు చేసేవాడు. మరికొంతమందిని శారీరకంగా కూడా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లి, వాటిని అమ్మి జల్సాగా తిరిగేవాడు. ఈ విధంగా సుమారు 200 మంది అమ్మాయిలు, 100 సంఖ్యలో మహిళలను మోసగించినట్లు తెలిసింది.
  • పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్‌ఐలు ఎస్‌కెఎం హుసేన్, బి.రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్‌ జి.సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు ఎస్‌.ఓబులేసు, పులయ్య, ప్రదీప్‌లను డిఎస్పీ సునీల్‌ అభినందించారు. ఈ సంఘటనలో నిందితుడి నుంచి రూ.1,26,000 నగదును, 30గ్రాముల బరువున్న బంగారుగాజులు, ఒక జతకమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవిరింగ్, నిందితుడి సెల్‌ఫోన్‌లను రికవరీ చేశారు.
మరిన్ని వార్తలు